ఇళ్లలోకి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి వ్యర్థాలు

Mar 14,2024 23:44
ఇళ్లలోకి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి వ్యర్థాలు

ప్రజాశక్తి-రాజానగరం రాజానగరం రావులచెరువు గట్టు ప్రక్కన ఉన్న శ్మశాన వాటిక భూమిలో జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల జనరల్‌ ఆసుపత్రి రోగులు ఉపయోగించిన వ్యర్థాలు మెడికల్‌ కళాశాల వాహనాల్లో తీసుకుని వచ్చి వేస్తున్నారు. ఇవి సమీపంలో నివాసం ఉంటున్న ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు గురువారం ఆందోళన చేశారు. జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో రోగులకు ఉపయోగించిన సిలైన్‌ బాటిల్స్‌, శస్త్ర చికిత్స చేసినప్పడు రక్తంతో తడిసిన దూది, గాజు గుడ్డలు, గడువు ముగిసిన మందులు, రోగులు తిన్న ఆహార పదార్థాలను లారీలు, ట్రాక్టర్లతో తీసుకుని వచ్చి ప్లాస్టిక్‌ సంచుల్లో మూటలు కట్టి వేస్తున్నారు. నిబంధనల ప్రకారం శస్త్ర చికిత్స వ్యర్థాలను బయోమెడికల్‌ కంపెనీలకు పంపి మెడికల్‌ వ్యర్థాలను దహనం చేయాలి. ఈ నిబంధనలు తుంగలో తొక్కి జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల నుండి వచ్చే వ్యర్థాలను నేరుగా శ్మశాన వాటికలో వేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తీసుకుని వచ్చిన వ్యర్థాలను రాత్రి సమయంలో నిప్పు పెట్టి అంటిస్తున్నారు. దీని వల్ల సమీపంలో ఇళ్లలోకి నల్లటి కెమికల్‌ పొగ ఆవరించి దగ్గు, కళ్లు మంటలు, చర్మపై దద్దుర్లు వస్తున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మరోపక్క రక్తంతో తడిసిన దుస్తులు మందులు గాలికి ఎగురుతూ ఇల్లలోకి నేరుగా వస్తున్నాయి. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెంది జిఎస్‌ఎఎల్‌ మెడికల్‌ కళాశాల చెందిన ట్రాక్టర్ను అడ్డుకున్నారు. వెంటనే మెడికల్‌ కళాశాల వ్యర్థాలను స్మసాన వాటికలో వేయకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

➡️