గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 4,2024 22:09
గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిగ్రూప్స్‌, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ అవ్వాలని ఎంఎల్‌సి, పోటీ పరీక్షల నిపుణుడు కెఎస్‌.లక్ష్మణరావు సూచించారు. యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, వీరేశలింగం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో గ్రూప్స్‌, డివైఇఒ పోటీ పరీక్షల అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున గ్రూప్స్‌ అభ్యర్థులు హాజరుయ్యారు. సదస్సు ప్రారంభ సభలో ఎంఎల్‌సి లక్ష్మణరావు మాట్లాడుతూ అభ్యర్థులు సిలబస్‌పై పట్టు కలిగి ఉండాలని, ప్రీవియస్‌ పేపర్లు క్షుణ్నంగా అధ్యయనం చేయాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రశ్నపత్రంలో ఇచ్చిన ప్రశ్నలను బాగా అవగాహన చేసుకున్న తర్వాతే సమాధానం రాయాలని తెలిపారు. భారత సమాజం, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అనే రెండు సబ్జెక్టుల నుంచి 60 మార్కులకు పేపర్‌ ఉంటుందని ఇవి అన్నీ స్పెషలైజేషన్‌ సబ్జెక్టుల వారికి కీలకమైనవని తెలిపారు. ఈ రెండు సబ్జెక్టులపై మూడు గంటలపాటు అవగాహన కల్పించారు. మరో ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గ్రూప్స్‌, డిఎస్‌సి ఇతర పోటీ పరీక్షలు నిర్వహించకుండా, రాష్ట్రంలో సుమారు 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్‌లో కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అరకొర పోస్ట్‌లు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 50,000 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే 6000 ఒప్పంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే గ్రూప్స్‌, డిఎస్‌సి పోస్టుల సంఖ్యలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.రాజులోవ, వీరేశలింగం విజ్ఞాన కేంద్రం నాయకులు జె.రూపస్‌ రావు మాట్లాడారు. అనంతరం వెయ్యి మందికి ఉచితంగా మెటీరియల్‌ పంపిణీ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఇవిఎస్‌ఆర్‌. ప్రసాద్‌, ఎన్‌.రవిబాబు, కె.రమేష్‌బాబు, సిహెచ్‌.దయానిధి, ఎం.విజయగౌరి, కెవిఎస్‌.ప్రకాష్‌, చిలుకూరి శ్రీనివాస్‌, డివైఎఫ్‌ఐ సభ్యులు ఎన్‌.సాయి ప్రసాద్‌, బి.పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఇ.భాస్కర్‌, జ్యోతి, కనక, మహేష్‌, దుర్గ పాల్గొన్నారు.

➡️