టిడిపి కంచుకోట నిలిచేనా?

Mar 5,2024 00:02
టిడిపి

నిడదవోలు టిడిపిలో అయోమయం
జనసేనకు కేటాయింపుతో కేడర్‌లో అసంతృప్తి
పరస్పర సహకారంపై నీలినీడలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
జిల్లాలో టిడిపి కంచుకోటల్లో ఒకటైన నిడదవోలు నియోజక వర్గంలో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అధికార వైసిపిని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా టిడిపి, జనసేన జతకట్టిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇటీవల ఉమ్మడి జాబితా విడుదల చేశారు. రెండో జాబితా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ను నిడదవోలు నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు. కందుల దుర్గేష్‌ రాజమహేంద్ర వరం రూరల్‌ నియోజక వర్గం సీటు ఆశించారు. అయితే ఆ స్థానం కోసం టిడిపి సీనియర్‌ నేత, ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు అతని మద్దతు దారులు టిడిపి అధినేతపై ఒత్తిడితేవడంతో జనసేనకు భంగపాటు తప్పలేదు. టిడిపి స్థాపించిన నాటి నుంచి అప్పటి కొవ్వూరు నియోజక వర్గంలో భాగమైన నిడదవోలులో బలమైన పునాది ఏర్పడింది. మాజీ ఎంఎల్‌ఎ పండ్యాల వెంకటకృష్ణారావు (కృష్ణబాబు) పలు మార్లు ఎంఎల్‌ఎగా విజయ ఢంకా మోగించారు. 2009లో రాజశేఖరెడ్డి ప్రభావంతో రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గెలుపొందినా ఈ నియోజక వర్గంలో మాత్రం టిడిపి అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు గెలుపొందారు. 2014లోనూ మరోసారి గెలుపొంది రికార్డుల కెక్కారు. అయితే 2019లో వైసిపి అభ్యర్థి శ్రీనివాసనాయుడు రాకతో ఓటమి తప్పలేదు. జనసేనకు కేటాయింపుతో కేడర్‌లో అసంతృప్తిటిడిపి-జనసేన రెండో జాబితాలో నిడదవోలు అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే జాబితా విడుదలకు ముందే నిడదవోలు నియోజక వర్గం జనసేనకు కేటాయించినట్లు వస్తున్న వార్తలు టిడిపి కేడర్‌లో అసంతృప్తిని రగిల్చాయి. ఈ ప్రాంతంలో టిడిపి టికెట్‌ కోసం మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు, టిడిపి సీనియర్‌ నేత కందుల సత్యనారాయణ పోటీపడుతున్నారు. బూరుగు పల్లి శేషారావుకు రెండు సార్లు గెలిచిన అనుభవంతో పాటు ఓ ప్రముఖ విద్యా సంస్థల అధినేత కావడంతో నియోజక వర్గలో పట్టు ఉంది. అయితే కుందుల సత్యనారాయణకు స్థానికంగా పట్టు ఉండటంతో టికెట్‌ ఆశిస్తున్నారు. అధినేత ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలుపు ఖాయమనే అభిప్రాయం టిడిపి కేడర్‌లో వ్యక్తమవుతోంది. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి టిడిపి విజయావకాశాలను దగ్గర చేస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఈ ఇరువరికీ కాకుండా జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కు కేటాయించడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత మూడు ఎన్నికల్లోపోటా పోటీగా

అధికార వైసిపిని అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యంగా ఏర్పడి పొత్తు ఉమ్మడి అభ్యర్థిని విజయం వరిస్తుందా..? లేక అసంతృప్తుల నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థికి పరిస్థితులకు అనుకూలంగా మారుతుందా అనే సందేహం టిడిపి కేడర్‌ను వెంటాడుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జి.శ్రీనివాసనాయుడుపై టిడిపి అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు 5,766 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా జి.శ్రీనివాసనాయుడు పోటీ చేయగా 75,232 ఓట్లు సాధించారు. అయితే 6,359 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు 81,591 ఓట్లు సాధించడంతో రెండో సారి గెలిచి రికార్డుల కెక్కారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఈ ఇరువురే ప్రత్యర్ధులుగా పోటీ పడ్డారు. వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన జి. శ్రీనివాసనాయుడు 21,688 ఓట్ల మెజారిటీతో గెలుపొంది. తేదేపా-జనసేన అభ్యర్థులు పరస్పర సహకారం లేకుంటే మరోసారి అధికార పార్టీకి కలిసొచ్చే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. అయితే తేదేపా-జనసేన అధినేతలు నిడదవోలు నియోజక వర్గం గెలుపునకు ఎటువంటి తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

➡️