మెగా జాబ్‌ మేళా నిర్వహణకు ఏర్పాట్లు

Feb 21,2024 22:35
మెగా జాబ్‌ మేళా నిర్వహణకు ఏర్పాట్లు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌రాజమహేంద్రవరంలో ఐదు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌ మేళా నిర్వహించి ఆరు వేల మందికి ఉద్యోగ కల్పన చేయనున్నట్లు డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ అధికారి ఎన్‌వివిఎస్‌.మూర్తి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని న్యాక్‌ కార్యాలయంలో తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నోడల్‌ అధికారులతో జాబ్‌ మేళాపై ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ, సుమారు 100 కంపెనీల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మేగా జాబ్‌ మేళా నిర్వహించడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్‌టిసి బస్టాండ్‌ సమీపంలో విఎల్‌ పురం వద్ద ఉన్న మార్గానీ ఎస్టేట్‌లో ఫిబ్రవరి 28న ఉదయం 10 గంటల నుంచి జాబ్‌ మేళా నిర్వహించడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికీ మెగా జాబ్‌ మేళా వివరాలు తెలియజేయడం కోసం మండలాల వారీగా కనీసం 100 మంది నిరుద్యోగులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌లు, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం అందించే లక్ష్యంతో పని చెయ్యాలని తెలియ చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సహాయ సిఇఒ జిఎస్‌.రామ్‌గోపాల్‌, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.హరిశ్చంద్రప్రసాద్‌, జిల్లా పరిశ్రమల అధికారి బి.వేంకటేశ్వర రావు, జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి ఎం.కొండలరావు, డివిజనల్‌ పిఆర్‌ఒ ఎంఎల్‌ ఆచార్యులు, తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు.

➡️