మోడీ కూటమిని గద్దె దించుదాం

Feb 16,2024 23:22
బంద్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం
మోదీ కూటమిని గద్దె దించుదాం… దేశాన్ని కాపాడుకుందాం… అంటూ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె విజయవంతమైంది. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఈ బంద్‌, సమ్మె జరిగింది. రైతులు, వివిధ పరిశ్రమల్లో కార్మికులు, రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రాజమహేంద్రవరంలో కార్మికులు, రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కోటిపల్లి బస్టాండ్‌ వద్దగల హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ నుండి శ్యామల సెంటర్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కొటగుమ్మం సెంటర్‌లో జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ కె.రాంబాబు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు ఎవి.రమణ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారన్నారు. ఎన్నికల బాండ్లు ద్వారా చట్టబద్ధం చేసి రూ.6,500కోట్లను కార్పొరేట్ల నుంచి విరాళాలుగా పొందిందన్నారు. దానికి ప్రతిఫలంగా కార్పొరేట్లకు కావాల్సిన చట్టాలు, విధానాలను రూపొందించి దేశ సంపదను మొత్తం కట్టబెట్టిందని విమర్శించారు. రైతులకు కనీసం మద్దతు ధర అమలు మరిచారన్నారు. రైతు చట్టాల పేరుతో భూములను మొత్తం కార్పొరేట్లకు దోచి పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ, బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా లక్షల కంపెనీలు మూతపడి కోట్లాది మంది కార్మికుల రోడ్లపాలయ్యారని విమర్శించారు. ఫిక్స్‌ టర్మ్‌ ఎంప్లారుమెంట్‌ పేరుతో నాలుగేళ్ల ఉద్యోగం, 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా చేసిందన్నారు. దేశంలో 80 శాతంగా ఉన్న పేదలపై పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీల భారాలు మోపిందన్నారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి అల్లర్లు సృష్టిస్తుందన్నారు. రవాణారంగం పూర్తిగా కుదేలైందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత దారుణంగా రవాణారంగంలో జరిమానాలున్నాయన్నారు. రోడ్‌ సేఫ్టీ బిల్లు సవరణలు తీసుకొచ్చి రవాణా రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకుందన్నారు. రవాణా కార్మికులకు తక్షణం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్నారు. హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి.పవన్‌, నాయకులు వీ రాంబాబు, అప్పల నరసయ్య, వెంకటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు సప్ప రమణ, నల్ల రామారావు మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, నాయకులు కెఎస్‌వి.రామచంద్రరావు, ఎస్‌ఎస్‌.మూర్తి, ఎం.వెంకటలక్ష్మి, కె.అన్నామణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇ.భాస్కర్‌, ఎన్‌.రాజా ఎఐటియుసి జిల్లా నాయకులు కొండలరావు, నల్లా రామారావు, రామకృష్ణ, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కె.జోజి, సిహెచ్‌.శివ, పిట్టా నరసింహమూర్తి, కె.లాజర్‌, డి.శ్రీనివాసరావు, ఎం.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు కొవ్వూరు కమిటీ ప్రధాన కార్యదర్శి బీరా రవి అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు మాట్లాడారు. పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల, కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. పైగా రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి ఇబ్బందులకు గురిచేసిందన్నారు. సిపిఎస్‌ను రద్దు చేయాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎపి అంగన్‌వాడీవర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యాంబ మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.నాగేశ్వరరావు, మాణిక్‌ రెడ్డి, హరిబాబు, జట్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఉడతల సత్యనారాయణ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు భూపతి రవీంద్ర పూజారి వాసు కళ్యాణి రాజేష్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు వి.శ్రీదేవి, చిన్న లక్ష్మి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు శాకా పుల్లారావు మద్దతు తెలిపారు. చాగల్లులో కార్మికులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. మూతపడిన సుగర్‌ ప్యాక్టరీ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.పోసమ్మ, రైతు, కౌలు సంఘం జిల్లా నాయకులు గారపాటి సుబ్బారావు, జుజ్జవరపు శ్రీను, మండల నాయకులు కె.దుర్గారావు, ఎస్‌కె.ఆదామ్‌, రమేష్‌ మాట్లాడారు. కౌలు, రైతు సంఘం, సిఐటియు అనుబంధ యూనియన్ల నాయకులు, కార్మికులు, హమాలీలు, మిడ్డే మీల్స్‌ కార్మికులు పాల్గొన్నారు. పెరవలిలో రైతు కిసాన్‌ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. బ్యాంకులు, పోస్టాఫీసులను మూయించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.జ్యోతిరాజు, పాల్గొన్నారు గోపాలపురం మండలం దొండపూడిలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో సమ్మె విజయవంతమైందని ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కురసం లత తెలిపారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ సెంటర్లో నిరసన తెలిపారు. దేవరపల్లిలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద నిర్వహించిన సభలో సిఐటియు మండల కార్యదర్శి భగత్‌ మాట్లాడారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. రైతు సంఘం జిల్లా నాయకులు ఉండవల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలన్నారు. లారీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు లక్కా శ్రీనివాసు భూదేటి రామచంద్రం, ట్యాక్సీ డ్రైవర్‌ యూనియన్‌ నాయకులు పాముల శ్రీనివాసు, ఎఐటియుసి కార్యదర్శి ఆచంట సత్యనారాయణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు మల్లెపూడు వెంకటలక్ష్మి, మిడ్డేమీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.రాజకుమారి, స్కూల్‌ స్వీపర్స్‌ యూనియన్‌ నాయకులు గుంటూరు వరలక్ష్మి, గ్యాస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అయినపర్తి శ్రీనివాసరావు, గేలం సత్యనారాయణ, వి.దుర్గారావు పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు అంగన్‌వాడీలు మద్దతు తెలిపారు. రాజానగరం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జోగు జగన్నాథం రావు ఆధ్వర్యంలో బహదూర్‌ అన్నదాన సత్రం నుంచి సాయిబాబా గుడి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు జె సత్తిబాబు మాట్లాడారు. మరుకుర్తి వీరలక్ష్మి, బొలిశెట్టి సత్యవతి, దొమ్మ సీత, గోరచ దుర్గ, పాల్గొన్నారు. కడియంలో అన్నదాతలు, కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల బంద్‌, సమ్మెకు అంగన్‌వాడీలు మద్దతు తెలిపారు. దేవి చౌక్‌ సెంటర్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. నాయకులు కె.బేబిరాణి, వై.సుజాత, కె.ఏడుకొండలు, పి.సుజాత, ఎం.వీరమణి, పి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు. సీతానగరంలో సిఐటియూ జిల్లా నాయకులు పవన్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, విఆర్‌ఎలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తదితర కార్మికులు పాల్గొన్నారు.

➡️