పెన్షనర్ల మరణాలకు జగన్‌దే బాధ్యత

Apr 5,2024 23:17
పెన్షనర్ల మరణాలకు జగన్‌దే బాధ్యత

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, నల్లజర్లరాజకీయ కుట్రతో పెన్షన్‌ దారుల మరణాలకు కారకుడైన సిఎం జగనే కారణమయ్యాడని, వెంటనే సిఎం పదవికి రాజీనామా చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాజకీయ కుట్రలతో ప్రజల ప్రాణాలు తీస్తూ జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్‌లో శుక్రవారం చంద్రబాబు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాయుడు మాట్లాడుతూ… ”రాజకీయాల్లో చేసే మంచి పనులతో ఓట్లు అడగాలి, కానీ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందడం సరికాదు. వైసిపి డిఎన్‌ఎలోనే శవరాజకీయాలు ఉన్నాయి. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. గత ఎన్నికల్లో బాబాయిని చంపి నెపం మాపై నెట్టి సానుభూతితో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వద్ధులను చంపేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ దురుద్ధేశంలో అధికారుల పాత్ర కూడా ఉంది. 1న ఇవ్వాల్సిన పెన్షన్‌ ఎందుకివ్వలేదు. ఓడిపోతామన్న భయంతోనే అప్పు తెచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచి పెట్టారు. మార్చితో బడ్జెట్‌ ముగుస్తుంది…దీంతో ముందే నిధులు ఖాతా నుంచి తీసుకోవాలి. దీన్ని ముందే గమనించి డబ్బులు డ్రా చేసి పెన్షన్లు అందిస్తే ఇబ్బందులు ఉండవు. స్వార్థ రాజీకీయాల కోసం ఖజానా ఖాళీ చేసి 1న ఇవ్వలేదు. ఏప్రిల్‌ 3న ఇస్తామని మార్చి 27న సర్క్యులర్‌ ఇచ్చారు. వాలంటీర్లను పెన్సన్‌ పంపిణీలో జోక్యం చేసుకోకూడదని మాత్రమే ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప వాలంటీర్లు మాత్రమే పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌ చెప్పలేదు. ఇన్నాళ్లూ మీటింగ్‌లకు రాకపోతే పథకాలు తొలగిస్తూ… బెదిరించారు. వాలంటీర్లు తటస్థంగా ఉండాలని మేము మొదటి నుండి కోరుతున్నాం. వాలంటీర్‌ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. మేము వచ్చిన తర్వాత కూడా వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం. మంచి చదువున్న వారికి కెరీర్‌ బిల్డ్‌ చేస్తాం. మళ్లీ ఈ ప్రభుత్వం రావడం లేదు… రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు రావు. మీ రాజకీయం కోసం వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా.? నా హయాంలో పంచాయతీ, రెవెన్యూ అధికారులతో పెన్షన్లు పంపిణీ చేశాను’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ రూ.30లతో పెన్షన్‌ విధానాన్ని తెచ్చారు. తర్వాత నేను రూ.75 చేశా…2004లో రాజశేఖర్‌ రెడ్డి వచ్చి రూ.200 చేశారు. 2014లో నేను మళ్లీ వచ్చాక రూ.1000 ఒకేసారి పెంచాను. ఖర్చలు పెరిగాయని ఆలోచించి రూ.2 వేలు చేశాను. నువ్వు వచ్చాక ఇచ్చింది ఎంత అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము మూడు నెలలకు పెంచిన పెన్షన్‌ రూ.3 వేలను రూ.4 వేలతో కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు.

➡️