ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి :కలెక్టర్‌

Mar 19,2024 17:58 #collector, #Krishna district, #meetings

పజాశక్తి-కలక్టరేట్‌(కృష్ణా) : ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి రాజాబాబు పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మంగళవారం జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, ఇతర పోలీసు అధికారులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా పోలీసు, ఎక్సైజ్‌ శాఖల ద్వారా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆమ్లలోకి వచ్చిందన్నారు. దీని ప్రకారం లైసెన్స్‌ పొందిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కొత్తగా ఆయుధాల లైసెన్సుల జారీపై నిషేధం అమలు చేయాలన్నారు. ఈ అంశంపై సమీక్షించుటకు జిల్లాస్థాయి స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.ఎక్సైజ్‌ శాఖకు సంబంధించి లిక్కర్‌ లైసెన్సులు జారీ నిషేధం అమలు చేయాలని, మద్యం ఉత్పత్తి మరియు సెంట్రల్‌ స్టాక్‌ పర్యవేక్షించి రోజువారి నివేదికలు సమర్పించాలన్నారు. ఎన్నికల నిబంధనలు మేరకు ప్రభుత్వ మద్యం విక్రయ దుకాణాలు ఉ.11 గం. నుండి రాత్రి 9 గం. వరకు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ ఉ .11 గం నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచే సమయాలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లా సరిహద్దుల్లో ఇంటెన్సివ్‌ ఏర్పాటు చేసి రవాణా శాఖ సమన్వయంతో వాహనాల ఉమ్మడి తనిఖీ నిర్వహించి మద్యం అక్రమ రవాణా అరికట్టాలన్నారు.జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి మాట్లాడుతూ జిల్లాలో 153 మంది ఆయుధ లైసెన్స్‌ కలిగి ఉన్నారని, వీటిలో ఇప్పటివరకు 132 ఆయుధాలు పోలీస్‌ శాఖ వద్ద డిపాజిట్‌ చేసుకోవడం జరిగిందన్నారు. బ్యాంకుల వద్ద, టోల్‌ గేట్లు వంటి వాటికి మినహాయింపు ఉంటుందని, ఇవి కాక మిగతా ఆయుధాలన్ని వెంటనే స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని డివిజనల్‌ పోలీసు అధికారులకు సూచించారు.డిఆర్వో కె చంద్రశేఖర రావు, డీఎస్పీలు, సిఐలు, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️