అక్రమ చెరువు తవ్వకం అడ్డుకున్న అధికారులు

ఐదు ట్రాక్టర్లు, జెసిబి సీజ్‌

ప్రజాశక్తి – ముదినేపల్లి

ప్రభుత్వ అనుమతులు లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా, రాత్రికి రాత్రి అక్రమంగా ఆక్వా చెరువు తవ్వకం పనులు చేపట్టాడు అధికార పార్టీకి చెందిన ఎంఎల్‌ఎ అనుచరుడు. ఈ సంఘటన మండలంలోని వణుదుర్రు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వణుదుర్రు గ్రామానికి చెందిన బోయిన అప్పన్న అధికార పార్టీకి చెందిన వ్యక్తి. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా చేపల చెరువు తవ్వుతున్నట్లుగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. అందిన సమాచారం మేరకు మండల తహశీల్దార్‌ కుమారి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గురువారం అర్ధరాత్రి చెరువు తవ్వకాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చెరువు తవ్వకాన్ని వెంటనే నిలువుగా చేయాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ సిబ్బంది అప్పన్నను హెచ్చరించారు. అయినా అప్పన్న రెవెన్యూ సిబ్బందిపై అధికార పార్టీ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎన్నికల నియమావళి అనుసరించి అనుమతులు లేకుండా తవ్వకాలు చేయకూడదని మండల తహశీల్దార్‌ కుమారి తేల్చి చెప్పడంతో అప్పన్న చెరువు తవ్వకాన్ని చేసేది లేక నిలుపుదల చేశాడు. దీంతో తెల్లవారుజామున చెరువు వద్ద ఉన్న ఐదు ట్రాక్టర్లు, ఒక జెసిబిను రెవెన్యూ సిబ్బంది సీజ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ కుమారి ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి సీజ్‌ చేసిన వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించడంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహాయంతో వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో విలేకరులపై దౌర్జన్యం: బోయిన అప్పన్న కొంతకాలంగా అధికార పార్టీ అండదండలతో గ్రామంలో అక్రమ చెరువుల తవ్వకాలకు శ్రీకారం చుట్టాడు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా తనకు ఉండడంతో తనకు ఎదురు లేదంటూ విర్ర విగిపోతున్నాడు. ఎంఎల్‌ఎ అనుచరుడు అంటూ గ్రామంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ చెరువుల తవ్వకాలు చేస్తున్నాడు. గత జనవరిలో అనుమతులు లేకుండా, నిబంధనకు విరుద్ధంగా అక్రమ చెరువు తవ్వకం చేపడుతున్న విషయం తెలుసుకున్న పలువురు విలేకరులు అప్పన్నను ప్రశ్నించగా వారిపై తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అధికార పార్టీ మాది, నాకు ఎంఎల్‌ఎ అండదండలు ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ, ఏమాత్రం లెక్క చేయకుండా విర్రవీగిపోతున్నాడు.

➡️