ఎన్నికల కోడ్‌ నిబంధనలు పాటించాలి

ప్రజాశక్తి – భీమడోలు
ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో భీమడోలు మండల పరిధిలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అమల్లోకి వచ్చిందని నోడల్‌ అధికారి, భీమడోలు ఎంపిడిఒ టి.స్వర్ణలత తెలిపారు. దీని అమలు కోసం పనిచేస్తున్న ఎంసిసి బృందాలు ఇప్పటివరకు 1286 అభ్యంతరకర అంశాలను తొలగించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులపై ఉన్న 128 గోడ రాతలు, 435 పోస్టర్లు, 337 బ్యానర్లు, 386 ఇతరాలు తొలగించినట్లు తెలిపారు. 1008 ప్రభుత్వ ఆస్తులు, 278 ప్రయివేట్‌ ఆస్తులపై ఇవి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ముసునూరు : ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా రాజకీయ సభలు నిర్వహించరాదని తహశీల్దార్‌ బాజీ, ఎస్‌ఐ పి.వాసు, ఎంపిడిఒ సిహెచ్‌.పద్మావతిదేవి అన్నారు. మండల కేంద్రమైన ముసునూరులో గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక రాజకీయ సభలు, ర్యాలీలు నిర్వహించినా అనుమతి లేకుండా మైక్‌లు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించినా, రాజకీయ కార్యక్రమాలను నిర్వహించి, వాటిలో వివాదాలు చెలరేగినా, గొడవలు పడినా సదరు కార్యక్రమాలను నిర్వహించిన రాజకీయ నాయకులపై, అనుమతి లేకుండా తిరిగిన మైక్‌, వాహనంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆగిరిపల్లి :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని, ఎటువ ంటి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆగిరిపల్లి ఎస్‌ఐ బి.సురేంద్రకుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా మండలంలోని సింగన్నగూడెం బస్టాప్‌ వద్ద ఆయన గురువారం చెకింగ్‌ స్వాడ్‌ టీంతో కలిసి వాహనాలను తనిఖీ చేశారు.

➡️