జాతీయస్థాయి కరాటే పోటీలకు పవన్‌కుమార్‌

Nov 30,2023 20:58

ప్రజాశక్తి – భీమడోలు
జాతీయ స్థాయిలో నిర్వహించే అంతర్‌ విశ్వవిద్యాలయాల కరాటే పోటీలకు గ్రామీణ ప్రాంతమైన పొలసానిపల్లి నుంచి యువ క్రీడాకారుడు ఎంపిక కావటం అభినందనీయమని గ్రామ సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన తెలిపారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న పొలసానిపల్లికి చెందిన పెనుమాక పవన్‌కుమార్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారు. ఈ మేరకు తన కోచ్‌ కె.మోహనమురళీకుమార్‌తో కలిసి సర్పంచిని గురువారం వారి నివాస గృహంలో కలిశారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన పవన్‌కుమార్‌ను సర్పంచి అభినందించారు. ఆయన కృషి ఇతరులకు ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా కోచ్‌ మాట్లాడుతూ పెనుమాక పవన్‌కుమార్‌ నారాయణపురం కేంద్రంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థాయిలో నిర్వహించిన అంతర కళాశాలల-50-బిలో కేటగిరి కరాటే పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జనవరి నెలలో భోపాల్‌లో నిర్వహించే అంతర్‌ విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారని తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఒకవైపు విజయవంతంగా విద్యాభ్యాసం కొనసాగిస్తూనే పొలసానిపల్లిలోని గీతాంజలి విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించే కరాటే కోచింగ్‌ క్యాంపులో కోచ్‌ కె.మోహనమురళీకుమార్‌ ఆధ్వర్యంలో కఠోర శిక్షణ పొందారని తెలిపారు. ఆ తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన అంతర కళాశాలల పోటీల్లో పాల్గొని ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యాసంస్థల కరస్పాండెంట్‌ ఎం.గౌతమ్‌కుమార్‌ తమ విద్యాసంస్థల పర్యవేక్షణలో నిర్వహించే కరాటే శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది, అంతర్‌ విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి పోటీలకు పవన్‌కుమార్‌ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో సైతం తమ విద్యాసంస్థలకు చెందిన పలువురు జాతీయస్థాయిలో వెయిట్‌ లిఫ్టింగ్‌, చెస్‌ ఇతర పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. తమ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌సిసి విభాగం పలువురు క్యాడెట్లు విద్యాభ్యాసం కొనసాగించేందుకు, ఉద్యోగ సాధనకు అవసరమైన రాయితీల కల్పనకు సహకరించిందని తెలిపారు.

➡️