‘ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది’

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

అంగన్వాడీ వర్కర్స్‌ గత 17 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కనపరుస్తుందని అంగన్వాడీ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.భారతి అన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ జిల్లా తరగతులు స్థానిక యుటిఎఫ్‌ భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ తరగతులకు పి.శాంతి, జి.విమల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్‌తో వెట్టి చాకిరీ చేయించుకుని మొండి చేయి చూపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేకసార్లు అంగన్వాడీ వర్కర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో అంగన్వాడీలకు కనీస వేతనాలు, గ్రాడ్యుటీల ఊసే ఎత్తడం లేదన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ గ్రాడ్యుటీ కోర్టులో వేసుకోండని సలహాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. గ్రాడ్యుటీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సహాయ కార్యదర్శి ఎం.నాగమణి, ఉపాధ్యక్షులు ఎస్‌.రాంబాబు, సిఐటియు సహాయ కార్యదర్శి షేక్‌ సుభాషిని, మండల పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

➡️