మహిళ హత్యకేసులో ముద్దాయి అరెస్టు

ప్రజాశక్తి – పోలవరం

మండలంలోని కొత్తరామయ్యపేటలో ఈనెల 25వ తేదీ, ఆదివారం రాత్రి మహిళ మేడూరి దుర్గ హత్య కేసులో హంతకుడిని పోలవరం పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పోలవరం డిఎ ఎన్‌.సురేష్‌ కుమార్‌ రెడ్డి స్థానిక డిఎస్‌పి కార్యాలయం వద్ద ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి నిందితుడిని చూపించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ హత్యకు గురైన దుర్గ హత్య విషయంలో సిఐ జి.మధుబాబు దర్యాప్తులో ప్రత్యేక బృందాలను, క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ నిపుణులతో నేర స్థలాన్ని పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిఘా ఏర్పాటు చేసి, హత్యకు పాల్పడిన ముద్దాయిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. హంతకురాలి దూరపు బంధువైన మేడూరి ప్రసాద్‌తో మృతురాలికి గత సంవత్సరం క్రితం నుంచి లైంగిక సంబంధం ఉందని, ఇటీవల నెలరోజుల నుంచి ఆమె వేరే వ్యక్తితో ఫోన్‌ మాట్లాడుతున్నట్లుగా అనుమానించి నిత్యం ఆమెతో గొడవపడేవాడని తెలిపారు. ఈ నేపథ్యంలో హత్యకు కొద్ది సమయం ముందు ముద్దాయి మృతురాలికి అనేకసార్లు ఫోన్‌ చేసి ఆమె వేరే వారితో ఫోన్‌ మాట్లాడుతున్న విషయంపై వాగ్వివాదం పెట్టుకున్నాడని, కోపంతో ఆమెను చంపాలనే ఇంట్లో కూరగాయలు తరిగే చాకు జేబులో పెట్టుకుని మృతురాలి ఇంటికి సమీపంలో ఉన్న మామిడి తోటలో నుంచి వెదురు కంచె దాటి వచ్చేసరికి మృతురాలు ఫోన్‌ మాట్లాడుతుండగా ఆమెపై దాడి చేసినట్లు తెలియజేశారు. ఆమెను వెనుకకు నెట్టి బోర్లా పడేసి, అరవకుండా చీరకొంగుతో మెడను ఒడిసిపట్టి తన వెంట తెచ్చుకన్న చాకుతో మెడ కోసి, ఆమె మాట్లాడుతున్న సెల్‌ ఫోన్‌ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడన్నారు. రక్తపు మరకలు అంటుకున్న బట్టలు తన గేదెల పాక వద్ద మార్చుకుని, చాకు, రక్తపు బట్టలు మొక్కజొన్న చేలో ఎవరికీ కనపడకుండా దాచినట్లు తెలిపారు. ఆధారాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ముద్దాయిని కోర్టులో హాజరు పరిచి, తదుపరి విచారణ చేస్తున్నామన్నారు. హత్య జరిగిన అతి తక్కువ వ్యవధిలో కేసు మిస్టరీ చేధించడానికి సహకరించిన పోలీసులను జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి అభినందించారని తెలిపారు. దర్యాప్తు బృందంలో సిఐ మధుబాబు, ఎస్‌ఐ పవన్‌ కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఏలియా రాజు, సిబ్బంది జె.బాబీ, బి.బాలాజీరావు, కె.కోటేశ్వరరావు, ఎం.గంగరాజు, బి.రమేశ్‌, కె.నాగరాజు, టిబిఆర్‌.ప్రసాద్‌, కె.మురళీకృష్ణ, జె.నాగలక్ష్మీ, పోలవరం బేస్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లు అశోక్‌, వీరబాబు, శివ, సతీష్‌లను రివార్డులకు సిఫార్సు చేయడం జరిగిందని తెలియజేశారు.

➡️