జోరుగా పందేలు..

పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం

అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజల వేడుకోలు

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ముగియటం, ఫలితాలు వెలువడటానికి 20 రోజులు సమయం వుండటంతో పందెం రాయుళ్లు తమ ఉహాగానాలకు తగినట్లుగా మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో జోరుగా పందేలు కాస్తున్నారు. ఒక పక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై, మరో పక్క ఐపిఎల్‌ క్రికెట్‌ పందేలపై రూ.వేలల్లో పందేలు జరుగుతున్నాయి. ఆగిరిపల్లి యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా దమ్మన్న మండపం వద్ద పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి. ఈదర, చిన్నాగిరిపల్లి, రావిచర్ల, తోటపల్లి, నూగొండపల్లి, వడ్లమాను అమ్మవారిగూడెం, ఈదులగూడెం, శోభనాపురం తదితర గ్రామాల నుంచి సాయంత్రానికల్లా పందెం రాయుళ్లు ఆగిరిపల్లి చేరుకొని మెయిన్‌ సెంటర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ వద్ద పందేలు కట్టె క్రమంలో తమ బైక్‌లను రోడ్డుపైనే నిలపడం, పెద్ద ఎత్తున గుమ్మిగూడి వుండటంతో యూనియన్‌ బ్యాంక్‌లోకి వెళ్లుటకు దారిలేక ఖాతాదారులు, వాహనదారులు, పాదాచారులు, మహిళలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీ, నాలీ చేసుకొనే మధ్యతరగతి కుటుంబాల వారు సైతం తాము కష్టపడ్డ సొమ్మును పందేల పాలు చేయటంతో ఆ కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందెం రాయుళ్లు ట్రాఫిక్‌ను సైతం స్తంభింపచేయటంతో మండల కేంద్రమైన ఆగిరిపల్లికి పలు రకాలైన పనుల మీద వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పందెం రాయుళ్లను కట్టడి చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

➡️