రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తి

వ్యవసాయ అధికారిణి ఉషారాణి

ప్రజాశక్తి – భీమడోలు

మండల పరిధిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ కార్యక్రమం పూర్తయిందని వ్యవసాయ అధికారిణి ఉషారాణి తెలిపారు. మండల పరిధిలో 12,720 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు జరగగా సుమారు 52 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అంచనాలు ఉన్నాయన్నారు. ధాన్యం సేకరణకు ప్రత్యేకించిన 14 రైతు భరోసా కేంద్రాలు, వాటికి అదనంగా రైతు సేవా సహకార సంఘాలు సంయుక్తంగా చేపట్టిన చర్యల కారణంగా 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. మిగిలిన ధాన్యం ప్రయివేట్‌ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు జరిగాయన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 28వ తేదీ వరకు జరిగిన ధాన్యం సేకరణ సొమ్ముల చెల్లింపు పూర్తయిందని, త్వరలోనే ఇతర బకాయిలు మంజూరు కానున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులను భూసారం పెంచేందుకు చైతన్యవంతులుగా చేసే క్రమంలో 50 శాతం రాయితీపై జనుము, జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వాటి సాగు జరుగుతుందని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌కు గాను వ్యవసాయ ప్రణాళిక రావాల్సి ఉందన్నారు. ఇక రైతుల పరంగా చూస్తే ధాన్యం సేకరణ సందర్భంగా ధాన్యం రవాణా చేసే వాహనాలకు, కాటా వేసిన వారికి తమ ఇష్టం మేరకు అది కొద్ది మొతాన్ని అందించామని తెలిపారు.

➡️