ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి
ప్రజాశక్తి – బుట్టాయగూడెం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సిపిఎం పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ తెల్లం దుర్గారావు అధ్యక్షతన సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకొస్తే దేశం మరింతగా వెనకబడుతుందన్నారు. బిజెపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిత్యం ధరలు పెంచుతూ సామాన్యులపై పన్నుల భారం విధించారన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెంచారన్నారు. ఒక వైపు ధరలు పెంచుతూ మరో వైపు ప్రభుత్వ ఆస్తులను అంబానీ, అదానీలకు కారు చౌకగా కట్టబెట్టారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. బిజెపికి మద్దతుగా ఉన్న వైసిపి, టిడిపి, జనసేనలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బిజెపి గిరిజన హక్కులను కాలరాస్తుందన్నారు. ఇప్పటికైనా ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న బిజెపికి, మద్దతు పలికే టిడిపి, జనసేన, వైసిపిలకు ప్రజలే సరైన గుణపాఠం చెబుతారాన్నారు. ఇండియా వేదకి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నిరుద్యోగులకు ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం బయట పెట్టి ప్రతిఒక్కరికీ రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామని మోసపూరిత హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని లేదని, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వడంలో బిజెపి విఫలమైందని చెప్పారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరించేందుకు బిజెపి దిగజారి పోయిందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్చిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్‌ పోలవరం ఎంఎల్‌ఎ అభ్యర్థి దువ్వెల సృజన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొమ్మిది పథకాలు అమలు చేయ నుందన్నారు. మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2.25 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీకి రూ.400 చెల్లిస్తామన్నారు. ఈ బహిరంగ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, మొడియం నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు తామ ముత్యాలమ్మ, ఎ.ఫ్రాన్సిస్‌, మండల కార్యదర్శులు వై.నాగేంద్రరావు, ఎం.జీవరత్నం, ఎస్‌.రాంబాబు, ఎం.దుర్గారావు, నాయకులు ఉడతా వెంకటేష్‌, వెట్టి వీరయ్య పాల్గొన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారయాత్ర కలిదిండి : రాష్ట్రానికి పదేళ్లుగా ద్రోహం చేస్తున్న బిజెపిని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేనలను, తొత్తు పార్టీగా ఉన్న వైసిపిని ఓడించాలని సిపిఎం జిల్లా నాయకులు డిఎన్‌విడి.ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య, ఎంఎల్‌ఎ అభ్యర్థి బొడ్డు నోబుల్‌లను గెలిపించాలని కోరుతూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ ప్రచారయాత్ర భాస్కరరావుపేట, మూలంక, పెదలంక, మట్టగుంట, యడవల్లి, కొండంగి, సున్నంపూడి, తాడినాడ, పోతుమర్రు, కలిదిండి, గురువాయిపాలెం, సాన రుద్రవరం, కోరుకొల్లు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో ప్రసాద్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం పదేళ్లుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయాల్లో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేనలను, తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపిని ఓడించాలన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార యాత్రకు సిపిఎం కలిదిండి మండల కార్యదర్శి ఎస్‌.మహంకాళి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భాస్కరరావు, మహేష్‌, అనిల్‌, సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు.

➡️