ఏళ్లు గడుస్తున్నా సరిగా అందని నీళ్లు..

Apr 11,2024 00:03

ట్యాంకర్ల వద్ద నీటి కోసం మహిళలు
ప్రజాశక్తి – మాచర్ల :
మాచర్ల పట్టణం గత పదేళ్లలో ఎంతో విస్తరించింది. పట్టణంలో అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వలస వచ్చిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలు ఇళ్ల స్థలాలు పొంది ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా చెన్నకేశవనగర్‌ కాలనీ, నెహ్రునగర్‌, వినాయకుని గుట్ట, అజాద్‌నగర్‌, రోప్‌ లైన్‌, కోడెల శివప్రసాద్‌ కాలనీ, లింగాపురం కాలనీ తదితర శివారు ప్రాంతాలు పెరిగాయి. అక్కడ నివసించే వారంతా రెక్కాడితే గాని డొక్కాడని కూలీలే. వీటిలో చాల కాలనీలు ఏర్పడి పదేళ్ల దాటింది. ఈ కాలనీల్లో తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కరం లేకుండా తాత్కలికంగా బోర్లు వేసి నీటి సరఫరాతో పురపాలక సంఘం సరిపెట్టింది. అవి లేని చోట ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.గతేడాది ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నుండే ఎండలు ప్రతాపం చూపుతుండటంతో క్రమేణ భూగర్బజలాలు తగ్గిపోయి బోర్లు అడుగంటుతున్నాయి. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా సమస్య పరిష్కారం చేయలేని స్థాయికి చాల ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది. నూతన బోర్లు వేసినా నీరు పడే పరిస్థితులు లేవు. కూలీ పనులకు వేళ్లే వారు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు మోసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మాచర్ల పట్టణంలో సుమారు ఏడు వాటర్‌ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. వాటి ద్వారా సుమారు 70 ట్రిప్పులు నీటి సరఫరా అవుతోంది. చెన్నకేశవనగర్‌ కాలనీకి చెందిన ప్రజలు కూలికి పోతు కాలనీలో ట్యాంకర్‌ ఆగే చోట ఇంటికి ఒక డ్రమ్ము పెట్టి వెళుతున్నారు. ట్యాంకర్‌ డ్రైవరు డ్రమ్ములను నింపి వెళతారు. కూలి పనుల నుండి సాయంత్రం వచ్చిన తరువాత ఆ నీటిని ఇళ్ళకు మోసుకుంటున్నారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీ అయినా ప్రతి ఏడాది తాగునీటి సమస్య తప్పడం లేదని కాలనీకి చెందిన మహిళలు సావిత్రి, జాన్‌బి వాపోయారు. మాచర్ల మున్సిపాల్టీకి తాగునీరు నిల్వ చేసుకునేందుకు అతి పెద్ద రిజర్వ్‌యర్‌ అందుబాటులో ఉంది. నాగార్జునసాగర్‌ కుడి కాల్వ నుండి నీటిని రిజర్వ్‌యర్‌లోకి పంపింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. నీరున్న శివారు కాలనీలకు తగినంత నీటి సరఫరా చేసేందుకు పైపులైన్లు ఏర్పాటు చేయకపోవటంతో ప్రతి ఏడాది నీటి సమస్యను శివారు ప్రాంత ప్రజలు ఎదుర్కోంటున్నారు. గత ఐదేళ్లలో పట్టణ శివారు ప్రాంతాల్లో పలు జగనన్న కాలనీలు ఏర్పాటయ్యాయి. మాచర్ల పట్టణానికి తాగునీటి సమస్య పూర్తి పరిష్కారానికి బుగ్గవాగు తాగునీటి పథకం ఒకసారి ప్రారంభమై అగిపోగా, రెండవసారి శంకుస్థాపనతో సరిపెట్టారు. పాలకులు మారుతున్నా పట్టణానికి తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా నీటి సరఫరాతో ఇబ్బందుల్లేకుండా చేయాలంటున్నారు.

➡️