ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Apr 12,2024 21:14

 ప్రజాశక్తి-విజయనగరం : వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు. మే 13న జరిగే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టరేట్‌ పోర్టికోవద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ ను కలెక్టర్‌ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా ఓటు హక్కు పొందేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. అర్హత ఉన్న వారంతా ఈనెల 14లోగా ఓటు కోసం దరఖాస్తు చేయాలని, వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లభిస్తుందన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీప్‌ లో భాగంగా నియోజకవర్గాలు, మండలాల్లో కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 29న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే పిఒలు, ఎపిఒలకు శిక్షణ పూర్తయిందని, రెండో విడత శిక్షణకు ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు ప్రత్యేక బందాలను నియమించామని, క్షేత్ర స్థాయిలో నిఘాను ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు కోటి రూ.54 లక్షలు విలువైన నగదు, మద్యం, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిఘాను మరింత పెంచుతామని, స్క్వాడ్‌ ద్వారా క్షేత్ర స్థాయిలో తనిఖీలను ముమ్మరం చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️