ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లు పరిశీలన

ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లు పరిశీలన

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ: సార్వత్రిక ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లేందుకు, తిరిగి స్వీకరించేందుకు అనుగుణంగా ఎయులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇవిఎంల పంపిణీకి ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ క్యాంపస్‌లో చెరో ఏడు డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం జరగనున్న ఎన్నికలకు పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జున శనివారం సాయంత్రం పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల ఆర్‌ఒలకు, నోడల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మెటీరియల్‌ పంపిణీ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సిబ్బంది వచ్చి మెటీరియల్‌ తీసుకునేందుకు వీలుగా నియోజకవర్గాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. జర్మన్‌ హ్యాంగర్ల సాయంతో టెంట్లు వేశారు. సిబ్బంది ఆయా కౌంటర్లకు సులభంగా చేరుకునేలా సమాచారం తెలుపుతూ ఎక్కడికక్కడ సైన్‌ బోర్డులు పెట్టారు. రూట్ల వారీగా సిబ్బంది వచ్చి సామగ్రి తీసుకునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు వహించాలని అక్కడ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌, ఏడీసీ కె.ఎస్‌. విశ్వనాథన్‌,ఉన్నారు.మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి విశాఖ కలెక్టరేట్‌ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలింగ్‌ సిబ్బందికి మూడో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది.సాధారణ, పోలీసు,వ్యయ పరిశీలకుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జున శనివారం ఉదయం కలెక్టరేట్‌ విసి హాలు నుంచి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే సిబ్బంది 13,069 మందిని పోలింగ్‌ కేంద్రాల వారీగా జిల్లా ఎన్నికల అధికారి కేటాయించారు. అలాగే మైక్రో అబ్జర్వర్లను కూడా పోలింగ్‌ కేంద్రాల వారీగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రక్రియలో పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్‌ శర్మ, పోలీసు పరిశీలకులు అమిత్‌ కుమార్‌, ఎస్‌.కోట,పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు సీతారామ్‌ జాట్‌, పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ కె. మోహన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

 ఏర్పాట్లు పరిశీలించిన మల్లికార్జున

➡️