స్మార్ట్ మీటర్లను తొలగించిన రైతులు, రైతు సంఘం నాయకులు

Mar 21,2024 17:05 #anatapuram

ప్రజాశక్తి- పామిడి : మండలంలోని ఎదురూరు, అక్కజాంపల్లి గ్రామాలలోని రైతులు వ్యవసాయ పంపు సెట్లకు అమర్చిన స్మార్ట్ మీటర్లను తొలగించారు. గ్రామ రైతులు, రైతు సంఘం సభ్యులు గురువారం వ్యవసాయ పంపు సెట్లకు స్పాట్ మీటర్ల ను బిగించే విధానాన్ని నిరసించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి ముత్యాలు, మల్లేష్ మాట్లాడుతూ ఆదానీ సంస్థకు 68 వేల కోట్ల కాంట్రాక్టు కోసం వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఫోన్లకు రీఛార్జ్ మొత్తం వేసుకున్నట్లు ముందస్తుగా డబ్బులు చెల్లించి విద్యుత్తు కొనడం ఈ విధానంలో భాగమన్నారు. ఇలా రైతులు చెల్లించాల్సిన డబ్బును మేము చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కపటత్వమన్నారు. గతంలోనే వ్యవసాయ పంప్ సెట్ లకు ఇలాంటి మీటర్లను బిగించవద్దని విద్యుత్ అధికారులను కోరామని, అలాంటి చర్యలను రైతుల నుంచి ప్రతిఘటిస్తామన్నారు. అనంతరం రైతులు, రైతు సంఘం నాయకులు వ్యవసాయ పంప్స్ సెట్లకు అమర్చిన దాదాపుగా 35 మీటర్లను తొలగించారు. తొలగించిన స్మార్ట్ మీటర్లను సంబంధిత వర్కర్స్ ట్రాక్టర్ లో వేసుకుని తీసుకెళ్లారు. ఈ విషయమై విద్యుత్తు అధికారులను ప్రజాశక్తి విలేకరి ఫోన్లో సంప్రదించగా మీటర్లను తొలగించే విషయం తమకు తెలియదు అన్నారు. కానీ హెల్పర్ గంగాధర్ అక్కడే ఉన్నట్టు సమాచారం.

➡️