కౌంటింగ్‌ తర్వాత గొడవలపై దృష్టి

May 22,2024 20:58

అనుమానిత ప్రదేశాల్లో పోలీసుల అవగాహన

ప్రజాశక్తి – సాలూరు : సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. పోలింగ్‌ రోజున మండలాల్లో గానీ, పట్టణంలో గానీ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎక్కడెక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగిన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో మళ్లీ గొడవలు తలెత్తకుండా పట్టణ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. టౌన్‌ సిఐ వాసు నాయుడు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ గొడవలు జరగడానికి అవకాశం వుందో అక్కడ స్థానికులతో, యువకులతో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పట్టణంలోని అక్కేనవీధి రామమందిరం వద్ద స్థానికులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు ఓటముల పై పందేలు కాయొద్దని, అవి గొడవలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. పోలీసుశాఖ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్‌ ఎస్‌ఐ కెవి సురేష్‌, రూరల్‌ ఎస్‌ఐ ఎంవి రమణ ఉన్నారు.

➡️