జీవవైవిధ్య పరిరక్షణతో ఆహార భద్రత

May 23,2024 23:41 #Bio diversity seminar in AU
Bio diversity seminar in AU

ప్రజాశక్తి-విశాఖపట్నం : జీవ వైవిధ్య పరిరక్షణతో ఆహార భద్రత సాధ్యపడుతుందని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ వీసీ ఆచార్య టి.జానకిరామ్‌ అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జానకిరామ్‌ మాట్లాడుతూ, అటవీ సంపద తగ్గిపోవడం, గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ల ఉద్గారాలు పెరిగిపోవడం ముప్పునకు కారణంగా మారుతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంఘటితంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవశ్యకతను వివరించారు. ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, జీవ సమతుల్యత దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి ప్రేమికులుగా ప్రతి వ్యక్తీ మారాల్సిన అవసరం ఉందన్నారు. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం సముద్ర ప్రాణులపైన కూడా ప్రభావం చూపుతున్నాయన్నారు. నేషనల్‌ బయోడైవర్సిటీ బోర్డు సభ్యులు ఆచార్య హంచిలాల్‌ మాట్లాడుతూ, ఉష్ణోగ్రతల్లో ఒక్క డిగ్రీ పెరుగుదల వ్యవసాయ రంగాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందన్నారు. ఆర్కిటిక్‌, అంటార్కిట్‌ ప్రాంతాలపై ఉష్ణోగ్రతల ప్రభావం, పర్యవసానాలను వివరించారు. ఏపి బయో డైవర్సిటీ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ బివిఎ.కృష్ణమూర్తి మాట్లాడుతూ, క్లైమేట్‌ చేంజ్‌ ప్రభావంగా జీడీపీ దెబ్బతింటుందన్నారు. పర్యాటకం పేరుతో జీవ వైవిధ్యం దెబ్బతినకుండా చూడాలన్నారు. సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య కె.శ్రీనివాసరావు, విభాగాధిపతి ఆచార్య కె.సంధ్య దీపిక ప్రసంగించారు. 

➡️