గప్‌చుప్‌!

May 11,2024 23:57

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో సిపిఎం అభ్యర్థి రోడ్‌షో
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ప్రచారం చివరి రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సిఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అంతేగాక రెండు జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబూ ఇదే తరహాలో నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా బ్లాక్‌ తరుఫున గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ విజయం కోసం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీతారాం ఏచూరి, కె.రామకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా బ్లాక్‌ తరుఫున వామపక్షాలు, కాంగ్రెస్‌ అభ్యర్థుల తరుఫున పిసిసి అధ్యక్షురాలు షర్మిల పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేశారు. టిడిపి, జనసేన అభ్యర్థుల తరుఫున పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రచార పర్వం ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. ప్రచారంలో పల్నాడు జిల్లాల్లో జరిగిన కొన్ని ఘర్షణలు, దాడులకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకున్నారు.

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తుది విడతగా ప్రచారం చేసి సాయంత్రం ఆరు గంటలకు ముగించారు. ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థుల తరుఫున వారి అనుచరులు ఇళ్లకు వెళ్లి ఓటర్లను ఆకట్టుకునేందుకు వీలుగా భారీగా నగదు, మద్యం పంపిణీ చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి, వైసిపి పోటాపోటీగా డబ్బు పంపిణీలో నిమగమయ్యారు. కరెన్సీ పంపిణీకి తమ సొంత మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేట్‌ సంప్థలకు చెందిన నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఆయా పార్టీ కార్యకర్తలతో పాటు ఆయా సంస్థల ఉద్యోగులనూ ఉపయోగిస్తున్నారు. పోలీసులు నిర్వహించిన దాడిలో పలుచోట్ల మద్యం, సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో వివిధ సామాజిక తరగతుల నాయకుల ద్వారా ఈ పంపిణీని ప్రారంభించారు. కొంతమంది అభ్యర్థులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.3 వేల వరకు ఇస్తున్నారని తెలిసింది. పెదకూరపాడులో రెండు పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఓటుకు రూ.5 వేల వరకు ఇస్తున్నారు. రెండురోజుల క్రితం పోస్టల్‌ బ్యాలెట్‌ నిమిత్తం రూ.7 వేల వరకు ఇచ్చారని సమాచారం. గురజాలలో ఒక మాజీమంత్రి సూచన మేరకు ఇరువురు నేతలు రాజీకి వచ్చి ఓటుకు రూ.1500 ఇస్తున్నారు. కొన్నిచోట్ల రూ.వెయ్యి నుంచి రూ.2వేలు ఇస్తున్నారు. మంగళగిరిలో అత్యధికంగా వైసిపి వారు రూ.4 వేలు ఇచ్చారని తెలిసింది. టిడిపి వారు రూ.3 వేలు ఇచ్చారని తెలియడంతో వైసిపి వారు రూ.4 వేలకు పెంచారు. పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల గ్రూపు నాయకుల ద్వారా ఈ పంపిణీని చేపట్టారు. కొంత మంది అభ్యర్థులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు.

➡️