సింగరాయిలో పేరుకుపోయిన చెత్త

Jun 9,2024 21:23

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని సింగరాయిలో నిత్యం సాయంత్రం పూట ప్రజల కూర్చునే వంతెన వద్ద గ్రామంలో ఉన్న చెత్తను వేయడం వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారింది. ఈ చెత్త వల్ల నూతన చెరువులో ఉన్న చేపలకు కూడా తెగుళ్లు సోకుతున్నాయని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సాయంత్రం పూట కోవెల వద్ద, వంతెన వద్ద కూర్చోవడం గ్రామస్తులకు అలవాటుగా మారింది. చెరువు, కోవెల వద్ద ఉన్న చెట్లు నీడని గాలి కోసం ఎక్కువ మంది కూర్చోడం అలవాటు పడ్డారు. ఇటువంటి ప్రాంతంలో దుకాణాల ద్వారా వచ్చిన వ్యర్థాలు, గ్రామస్తులు ఇంటిలో వాడుకున్న వేస్టేజ్‌ ఈ చెరువులో పడేయడం వల్ల వర్షానికి తడిసి వేస్ట్‌ పదార్థాలు కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ప్రధానంగా ఎస్‌సి కాలనీలో ప్రధాన సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువలో ఊరి నుంచి వచ్చిన వాడుక నీరుతో పాటు మురుగునీరు కూడా పైకి పోకుండా నిల్వ ఉండిపోయి దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. ఈ మురుగు కాలువల వల్ల ఈగలు, దోమలు నుంచి నిద్రలేక ఇబ్బంది పడుతున్నారని గ్రామ యువకులు నిరుజోగి కామేష్‌, జి.కనక, జి.సంతోష్‌, జే.అప్పలనాయుడు, నాయుడు, గుమ్మడి దేముడుబాబు, ఎన్‌ అప్పలనాయుడులు పంచాయతీ కార్యదర్శి కన్నంనాయుడును కోరినట్లు చెప్పారు. ఈ విషయంపై కార్యదర్శిని వివరణ కోరగా ఎన్నికలు పనుల్లో బిజీగా ఉన్నందున కొంత పారిశుధ్యం పనుల్లో వెనుక పడ్డానని గ్రామంలో పారిశుధ్య పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తారని, కూలీలు కూడా సమంగా దొరకలేదని చెప్పారు.

➡️