‘చెట్టినాడ్‌’ వ్యర్థాలతో పంటలు నాశనం

– సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద మిర్చి రైతులు ఆందోళన

ప్రజాశక్తి – దాచేపల్లి (పల్నాడు జిల్లా) :సిమెంట్‌ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాలు, కాలుష్యంతో వల్ల తమ పొలాలు పాడవడంతో పాటు పంట సైతం నాశనమవుతోందంటూ మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులోని చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ గేటు ఎదుట తక్కెళ్లపాడు గ్రామ రైతులు దెబ్బతిన్న తమ మిర్చి పంటతో బుధవారం బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిసరాల్లోని 50 ఎకరాల పంట భూమి దెబ్బతింటోందని, ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల భూమి పగుళ్లు వచ్చి దిగుబడి ఎకరాకు సగటున మూడు నాలుగు క్వింటాళ్ల వరకూ పడిపోతోందని వాపోయారు. మరోవైపు పైనుంచి వచ్చే దుమ్ము, దూళి కారణంగా మిర్చి కాయ కుళ్లిపోతోందని, మిగిలిన పంటను క్వింటాల్‌ రూ.ఐదారువేలు ధర తగ్గించి కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లి సిఐ సురేంద్రబాబు, ఎస్‌ఐ సంధ్యారాణి అక్కడకు వచ్చారు. ఫ్యాక్టరీ వారితో మాట్లాడి వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ తరుపున ఎస్టేట్‌ వ్యవహారాలను చూసే అధికారితో మాట్లాడగా రైతులకు ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇవ్వడంతో రైతలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బాధిత రైతులు పి రామసైదులు, పి నాగరాజు, జి సాంబయ్య, జి గోవర్ధన్‌, జి సుబ్బయ్య, బి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

➡️