ఎన్నికల్లో మద్యం అరికట్టేందుకు సహకరించాలి

May 7,2024 00:46

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో మద్యం నిల్వ చేయటం, పంపిణీని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సార్వత్రిక ఎన్నికల్లో మద్యం నియంత్రణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం సరఫరా కాకుండా పూర్తిస్థాయిలో నిఘాపెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 8,325 లీటర్ల మద్యం సీజ్‌ చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న 102 మద్యం రిటైల్‌ ఔట్‌లెట్లు, 102 బార్లు, 9 క్లబ్‌లలో మద్యం అమ్మకాలు, సరఫరాపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. సిసి కెమెరాల ద్వారా లైవ్‌స్ట్రీమ్‌ను అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. మద్యం డిపోలలో సిసి కెమెరాలు, మద్యం సరఫరా చేసే వాహనాలకు జిపిఎస్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్సైజ్‌, ప్రొబేషన్‌ శాఖ అధికారులు మద్యం షాపులలో అమ్మకాలలో నిఘా పెట్టడంతోపాటు, ఇతర ప్రాంతాల నుండి మద్యం సరఫరా కాకుండా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టుబడితే సరఫరా చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిల్వ చేసిన సంబంధిత అభ్యర్థిపై కేసు నమోదు చేయటంతోపాటు, మద్యం విలువను అతని ఎన్నికల ఖర్చుగా నమోదు చేయించాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ పెద్ది రోజా, అడిషనల్‌ ఎస్పీ రమణమూర్తి, ఎస్‌ఈబి అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ప్రొబేషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి వెంకటరామిరెడ్డి, ఎస్‌ఈబి సూపరింటెండెంట్‌ ఎల్‌.రంగారెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️