హోరాహోరీ ప్రచారం

May 10,2024 20:52

ప్రజాశక్తి – పూసపాటిరేగ, నెల్లిమర్ల : నెల్లిమర్ల నియోజక వర్గంలో వైసిపి అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు, ఎన్‌డిఎ అభ్యర్ధి లోకం నాగమాధవి ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. నేటితో ప్రచారం తుది దశకు చేరుకోవడంతో అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అంగబలం, అర్దబలం, కుల బలం తెరపైకి తీసుకువచ్చారు. నువ్వా నేనా అంటూ ప్రచారంలో పోటీ పడుతున్నారు. సంక్షేమ పథకాలను వైసిపి ప్రచార అస్త్రాలుగా పట్టుకుంటే.. సూపర్‌సిక్స్‌తో కూటమి అభ్యర్ధి నాగమాదవి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నాలుగు మండలాల్లో వీధి వీధికి, ఇంటింటికి తిరిగి ఓట్లును అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లును లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఈ నెలంతా ప్రచారాన్ని సాగించారు. ఆమె ఓడిపోతే అమెరికా వెల్లిపోతుందంటూ బడ్డుకొండ అప్పలనాయుడు తనదైన శైలిలో ప్రచారం చేస్తే…దానికి లోకం మాధవి స్పందించి తాను అమెరికా వెల్లడం కాదు అమెరికానే ఇక్కడ చూపిస్తా.. అంటూ కౌంటర్‌ ప్రచారం సాగిస్తున్నారు. ఆమెది నాన్‌ లోకల్‌ అంటూ వైసిపి ప్రచారం చేస్తే..తాను విజయనగరంలోనే చదువుకున్నాను, తనది లోకల్‌ అంటూ కౌంటర్‌ ప్రచారం చేశారు. బడ్డుకొండ అనకొండలా మారి కొండలను ఆక్రమించాడంటూ అమె ప్రచారం చేస్తే.. విధ్యాసంస్ధల పేరు చెప్పి కోట్ల విలువైన భూములను వేల రూపాయలతో కొట్టేసిన చరిత్ర మాలోకం ది అంటూ సెటైర్లు వేశారు. ఇలా నెల రోజులు పాటు వ్యక్తిగత విమర్శలతో ప్రాచారం సాగించారు. చివరకు తాము అధికారంలోకి వస్తే విమానాశ్రయం సంవత్సరంలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఇద్దరూ తమదైన శైలిలో ప్రసంగం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంను పారిశ్రామిక హభ్‌ చేస్తానంటూ మాదవమ్మ ప్రచారం చేస్తే, ప్రపంచ పటంలో నెల్లిమర్ల నిలబెడతామని వైసిపి ప్రచారం చేసింది. నేటితో ప్రచారం ముగియడంతో ఓటుకు నోటుతో ప్రలోబాలకు తెరతీశారు.ప్రలోభాలు ప్రారంభం గత నెల రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఎవరికి వారే ధీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా బరిలో నిలిచిన అధికార వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రచారంలో పోటీ పడ్డాయి. అధికార వైసిపి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని లబ్దిదారులపై ఆశపెట్టుకొని ప్రచారాన్ని కొనసాగిస్తుండగా, కూటమి అభ్యర్థి వైసిపి అవినీతి, అక్రమాలు ఎండగడుతూ ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన సూపర్‌ సిక్స్‌ అంశాలను తమ ప్రచారంలో అస్త్రాలుగా వాడుకున్నారు. ఇరువురి ప్రచారంలో ప్రజలు అంచనాకు మించి హాజరవుతుండటంతో ఎవరికి పట్టం కడతారో అర్థంకాని పరిస్థితి. నేటితో ప్రచారం పర్వం ముగిస్తున్నందున ఆయా పార్టీలు ఓటరను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాల పర్వం ప్రారంభించారు. గ్రామాల్లో మాజీ, తాజా సర్పంచులు, ఎంపిటిసిలు నేరుగా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ నగదు పంపిణీ చేసి తమ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోబాలు పెడుతున్నట్లు తెలిస్తోంది. కొంత మంది వలస ఓటర్లను రప్పించేందుకు పెద్ద ఎత్తున పోన్‌పే, గూగుల్‌ పే ద్వారా నగదును పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

➡️