గాలివాన బీభత్సం

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ సోమవారం సాయంత్రం వీచిన గాలివాన బీభత్సానికి 800 ఎకరాలలో అరటి చెట్లు ధ్వంసమయ్యాయి. రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఉద్యానవనాధికారి రాఘవేంద్ర రెడ్డి పులివెందుల మండలంలో ఇ. కొత్తపల్లి, నల్లపు రెడ్డిపల్లి, ఎర్రబల్లి, నల్లగొండ వారి పల్లి లింగాల మండలంలోని ఇప్పట్ల గ్రామాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల, లింగాల మండల పరిధిలో 200 మంది రైతులకు చెందిన 800 ఎకరాలలో అరటి తోటలు నేలకొరిగాయి. సుమారు రూ10 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది అన్నారు. 50 విద్యుత్‌ స్తంభాలు, నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయి. నష ్టపోయిన పంట నష్టాన్ని రైతుల వారీగా అంచనావేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నామని ఉద్యానవన అధికారి తెలిపారు. రైతులు ఎంతో అపురూపంగా కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఒక్కసారిగా నేలకొరగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. లక్షలు పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వస్తున్న సమయంలో ఇలా పంట నాశనం కావడంతో పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

➡️