బిజెపి గెలిస్తే..మన్యం మరో మణిపూరే

May 8,2024 21:41

గనులు, అటవీ సంపద లూటీకి వ్యూహం

ఇప్పటికే గిరిజన చట్టాలు ఉల్లంఘన

బృందా కరత్‌ పర్యటనతో బలపడుతున్న ఇండియా వేదిక

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : అరకు పార్లమెంట్‌ స్థానంలో బిజెపి – టిడిపి కూటమి బలపర్చిన బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత గెలిస్తే అటు రంపచోడ వరం నుంచి ఇటు పార్వతీపురం మన్యం జిల్లా వరకు మరో మణిపూర్‌గా మారబోతుంది. ఇదేదో బిజెపి వ్యతిరేకులు మాత్రమే చెప్తున్నమాట కాదు. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌ మన్యం, అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎన్నికల ప్రచారం తరువాత టిడిపి, వైసిపి కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజానీకంలో జరుగుతున్న చర్చ. బృందా ప్రసంగంలో చాలా అంశాలు గిరిజనులు, గిరిజనేతరుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఈరెండు జిల్లాల్లో ఇంతకుముందు జరిగిన పరిణామాలు, తాజాగా అరకు పార్లమెంట్‌పై బిజెపి చూపుతున్న ఆత్రం, మణిపూర్‌ రాష్ట్రంలో అక్కడి బిజెపి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సృష్టించిన హింకాసాకాండకు మధ్య ఉన్న రాజకీయ సంబంధాలను ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నారు. మణిపూర్‌ కొండల్లోని విలువైన గనులను కార్పొరేట్‌ గుత్తపెట్టుబడిదారులకు కట్టబెట్టాలని భావించిన బిజెపి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రెండు గిరిజన తెగల మధ్య మత చిచ్చురేపడం, ఈ విధ్వంసకర ఉన్మాద చర్యలు అమాయక గిరిజనుల మధ్య హింసాఘటనలు, హత్యలు, అత్యాచారాలు వరకు తీసుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోపాటు బిజెపి దొంగనాటకాన్ని ఖండించాయి. అయినా, సిగ్గురాని బిజెపి తిరిగి మన రాష్ట్రంలోని విశాఖ గిరిజన ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న బాక్సైట్‌, లేెటరైట్‌, మాంగనీస్‌ వంటి విలువైన గనులను కాజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గిరిజన ప్రాంతంలో కనీసం పార్టీ ఉనికి లేకపోయినప్పటికీ టిడిపి వద్ద పట్టుబట్టి అరకు లోక్‌సభ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయాలను తన ప్రసంగం ద్వారా తెలియజేసిన బృందాకరత్‌ ‘మీ ఇంటికొచ్చి దొంగతనం చేసిన వారిని, తిరిగి మళ్లీ రానిస్తారా?’ అంటూ అడిగిన ప్రశ్నకు గిరిజనులు స్పందిస్తూ ‘లేదు లేదు’ అంటూ సమాధానం చెప్పారు. ‘మరి బిజెపినో’ అనేసరికి ‘రానిచ్చేదే లేదు’ అంటూ సమాధానం చెప్పారు. మరి అటువంటి బిజెపితో టిడిపి జత కట్టడం సమంజసమా? అని ప్రశ్నలు సంధిస్తూ ఆ రెండు పార్టీల కలయిక వెనుక మోసం ఉందంటూ బృందా చేసిన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ‘ఈ విధంగా దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం కోసం మత కలహాలు సృష్టించిన, గిరిజనులు, దళితులు, మైనార్టీలు, రైతుల హక్కులు కాలరాసిన బిజెపి ప్రభుత్వానికి గడిచిన పదేళ్లలో ఇటు టిడిపి, అటు వైసిపి ఎంతో సహకరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఈరెండు పార్టీలకు చెందిన ఎంపీలూ పార్లమెంటులో నోరు మొదపలేదు’ అంటూ ఆమె జనానికి విరివరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి టైర్‌ పంచర్‌ అయ్యిందని, దానికి టిడిపి ఒకపంపు కొట్టే టైరులా ఉపయోగపడుతుంటే, వైసిపి కారువెనుక భాగంలోవున్న మరో స్టెఫినీలా పనిచేస్తోందని బృందా చెప్పినప్పుడు జనాల హర్షధ్వానాలు వ్యక్తం కావడం గమనార్హం. ఇడి, సిబిఐ, ఐటి వంటి స్వయం ప్రతిపత్తి సంస్థలను కేంద్రంలోని బిజెపి గత పదేళ్లగా వాషింగ్‌ మిషన్‌లోని పౌడర్‌లా ఉపయోగించి, అవినీతిపరులను నీతిమంతులుగా మార్చేసిదంటూ చేసిన సెటైర్లకూ మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తటస్తులతోపాటు టిడిపి, వైసిపిల పట్ల అసంతృప్తితో వున్నవారు ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను సమర్థిస్తూ చర్చలు మొదలుపెట్టారు. మొత్తంగా బృందా కరత్‌ రెండురోజుల పర్యటనతో దేశంలో బిజెపి రేపుతున్న మతోన్మాదం, సంపద దోపడీ మరోసారి తేటతెల్లమైంది.

➡️