గెలిస్తే చట్టసభల్లోనూ పోరాటం

May 10,2024 23:37

ఆత్మకూరులో చేనేత దండతో మద్దతు తెలుపుతున్న చేనేత కార్మికుడు
ప్రజాశక్తి-తాడేపల్లి :
ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు శుక్రవారం రాత్రి ఉండవల్లిలో రోడ్‌ షో ద్వారా ప్రచారం చేపట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. తీన్‌మార్‌ డప్పులు… ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలతో ప్రచారం ఉత్సాహంగా సాగింది. సుందరయ్య చౌక్‌, రామాలయం, అమరారెడ్డినగర్‌, దళితపేట, బాపనయ్యనగర్‌ ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోలో శివశంకరరావుకు స్థానికులు పూలమాలలు, హారతులతో స్వాగతం పలకడంతోపాటు మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ సెంటర్లలో జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు వామపక్షాలకే ఉందన్నారు. ఉండవల్లిలో బాపనయ్యనగర్‌, అమరారెడ్డినగర్‌ ప్రాంతాల్లో ఇళ్లు వేయించిన చరిత్ర సిపిఎందని చెప్పారు. నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా పేదలకు ఇళ్లు వేయించి రూ.కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. తాడేపల్లి ప్రాంతంలోని సంజీవయ్యనగర్‌, పోలకంపాడు తదితర ప్రాంతాల్లో ఇళ్లు వేయించి పేదలకు పట్టాలు ఇప్పించింది సిపిఎం అని స్పష్టం చేశారు. సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యేగా నిమ్మగడ్డ రామ్మోహనరావు ఉన్న సమయంలో అనేక కాలనీలు ఏర్పాటు చేయించడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా సిపిఎం అగ్రభాగన ఉందన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పోరాడే అభ్యర్థులను గెలిపించడం ద్వారా చట్టసభల్లోనూ ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం కల్పించాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి, తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు వి.వెంకటేశ్వరరావు, ఎస్‌.ఇమ్మానుయేలురాజు, బి.కోటేశ్వరరావు, పి.గాంధీ, ఒ.రమేష్‌, ఎం.శ్రీనివాసరెడ్డి, శివయ్య పాల్గొన్నారు.ప్రజల్లో మత విధ్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూలుస్తున్న బిజెపి, దాని మద్దతుదారులను ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సుందరయ్యనగర్‌ వివిధ బజార్లలో మైకు ప్రచారం నిర్వహించగా వివిధ కూడళ్లలో కృష్ణయ్య మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్న బిజెపిని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. మణిపూర్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో మారణకాండకు బిజెపియే బాధ్యత వహించాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు పదేళ్ల మోడీ పాలనలో పూర్తిగా అటకెక్కించారని దుయ్యబట్టారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బిజెపితో రాష్ట్రంలోని టిడిపి, జనసేన నేరుగా పొత్తు పెట్టుకున్నాయని, వైసిపి లోపాయికారిగా మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కె.కరుణాకరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

➡️