ఖర్చుకో లెక్కుంది..మీరితే చిక్కుంది

Apr 10,2024 22:12

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా

జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

రూ.80లక్షలు నగదు, రూ.కోటి విలువైన సామగ్రి సీజ్‌

వ్యయం మితిమీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :
ఎన్నికల్లో ఎవరికి నచ్చినట్టు వారు ఖర్చు చేద్దామంటే కుదరదు. ప్రతి ఖర్చుకూ ఓ లెక్కుంది. ఆ పరిమితి మీరితే చిక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనావళి మేరకు జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) నేతృత్వంలో నిరంతర నిఘా నేత్రాలు ఉన్నాయి. వివిధ పేర్లతో ప్రత్యేక బృందాలు జిల్లాలో పర్యవేక్షిస్తున్నాయి. అభ్యర్థులే కాదు. ఎవరైనా తగిన ఆధారాలు లేకుండా బస్సులు, రైళ్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో నగదు, వివిధ రకాల వస్తుసామగ్రి, మద్యం తరలించడానికి వీలు లేదు. అనుమానం వస్తే చాలు సీజ్‌చేసే అధికారం పోలీసులతో పాటు ఆయా బృందాలకు ఎన్నికల సంఘం కల్పించింది. కానీ, బృందాల నిఘా సరిపోవడం లేదు. వీరి పనితీరు పట్ల సాక్షాత్తు జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇటీవల జరిగిన సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు తార్కాణం.ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగనున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముమ్మరంగా ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అధికార యంత్రాంగం ఎన్నికల వ్యయాన్ని లెక్కించే పనిలో నిమగమైంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి అభ్యర్థులు చేసే ఖర్చును పార్టీ ఖర్చుగా పరిగణిస్తారు. నామినేషన్‌ వేసిన రోజు నుంచి చేసే ప్రతిఖర్చూ వారి వ్యయ పరిమితిలోకి వస్తుంది. ఎంపి అభ్యర్థి రూ.90 లక్షలు, ఎంఎల్‌ఎ అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం నిర్ణయించిన ఈ పరిమితి మేరకు నామినేషన్‌కు ముందు రోజే అభ్యర్థి జాతీయ బ్యాంకులో కొత్త అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలి. నామినేషన్‌ తర్వాత నుంచి ర్యాలీలు, సమావేశాలు, భోజనాలు, వాహనాలు, సౌండ్‌ సిస్టమ్‌, తదితర ఎన్నికల నిమిత్తం చేసే ఖర్చులన్నింటినీ అభ్యర్థి అక్కౌంట్‌ నుంచి మాత్రమే చెల్లించాలి. ఈనేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రత్యేక బృందాలు డేగ కళ్లతో గమనిస్తూనే ఉన్నాయి. పరిమితికి మించి ఎన్నికల వ్యయం దాటితే అభ్యర్థులకు చిక్కులు తప్పవని హెచ్చరికలు ఉన్నా అభ్యర్థులు మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం ధిక్కరించి ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరపత్రాల పంపిణీ, జెండాలు, భోజనాలు, ర్యాలీకి కార్లు, మోటార్‌ సైకిళ్లపై వచ్చినవారికి బండిలో పెట్రోల్‌ పోయించడం, రూ.300 నుంచి రూ.500 వరకు పంపిణీ చేయడం జరుగుతోంది. అభ్యర్థులు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

  69 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ టీములు

జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 9 చొప్పున మొత్తం 69 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ టీములు (ఎఫ్‌ఎస్‌టి) ఏర్పాటు చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ టీమ్స్‌ (ఎంసిసి) బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో ఐదు చొప్పున మిగిలిన చోట్ల నలుగురు చొప్పున నియమించారు. వీరితోపాటు స్టాటిక్‌ సర్వ్లైలైన్‌ టీమ్స్‌ (ఎస్‌ఎసి), నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున వీడియో సర్వ్లైలైన్‌ టీమ్స్‌ (విఎస్‌), మరో ఇద్దరేసి చొప్పున వీడియో వ్యూయింగ్‌ టీము (వివిటి)లు ఉన్నాయి. ఈ బృందాలు ఎన్నికల నియమావళి సక్రమంగా అమలు జరిగేలా కృషి చేస్తాయి. నిరంతర నిఘాకు ప్రత్యేక బృందాలు వివిధ పార్టీలు, అభ్యర్థుల కార్యకలాపాలు, ఖర్చులు తదితరాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘావేసింది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 21 మంది అసిస్టెంట్‌ ఎక్స్‌పెండీచర్‌ ఆఫీసర్‌ (ఎఇఒ)లను నియమించారు. ప్రతి ఎఇఒ పరిధిలోనూ మరోముగ్గురు సహాయకులు ఉంటారు. పార్లమెంట్‌ అభ్యర్థిపైనా అన్ని అంశాల్లో నిఘా ఉంచేందుకు 8మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యాన క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా ఉంటారు. వీరంతా ఎప్పటికప్పుడు రికార్డులు నిర్వహిస్తారు. నామినేషన్‌ నుంచి ఎన్నికలు ముగిసేలోగా మూడుసార్లు తమ వద్ద ఉన్న వివరాలతో అభ్యర్థులు చూపిన వ్యయ వివరాలతో సరిపోల్చి చూస్తారు. అభ్యర్థులు వ్యయం తక్కువ చూపిస్తే తమ వద్ద ఉన్న ఆధారాలను వారికి చూపించి సరిచేయిస్తారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన నాటి నుంచి నెలరోజుల్లోగా అభ్యర్థులు తమ పూర్తి ఖర్చుల వివరాలు, వాటి బిల్లులను అందించాలి. ప్రచారంలో భాగంగా ఏదైనా ర్యాలీ నిర్వహించినప్పుడు వీడియో తీసి ఎన్ని ఆటోలు, కార్లు, మోటారు సైకిళ్లు ఉన్నాయి, ఫ్లెక్సీలు, లౌడ్‌ స్పీకర్లతోపాటు జెండాలు, కండువాలు, పోస్టర్లు, కరపత్రాలు తదితర ఎన్నికల సామగ్రి ఎన్ని ఉన్నాయి, భోజనాల ఖర్చు ఎంత తదితర అంశాలను పరిశీలించి జిల్లా కమిటీ విడుదల చేసిన స్టాండర్డ్‌ రేట్స్‌ ఛార్ట్‌ ప్రకారం ఖర్చును లెక్కిస్తారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో ప్రకటనలు, పెయిడ్‌ ఆర్టికల్స్‌ చేసే ఖర్చును అభ్యర్థుల ఎన్నికల వ్యయంలోకి తీసుకుంటారు. పరిమితికి మించి ఖర్చు చేసినా, బిల్లులు సక్రమంగా చూపించపోయినా వారికి చిక్కులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

18లక్షల నగదు, రూ.కోటి విలుగల వస్తువులు, మద్యం సీజ్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ.17.84లక్షల నగదును సీజ్‌ చేశారు. 29,148 లీటర్ల మద్యం, 29.35లక్షల విలుగల డ్రగ్స్‌, రూ.10.38లక్షల విలువగల లోహ పరికరాలు, రూ.31.01లక్షల విలువ గల వివిధ విస్తుసామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కలుపుకుని సుమారు రూ.1,17,32,501 విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న చోట ప్రత్యేక నిఘాపెడుతున్నారు. కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్‌ రూంజిల్లా స్థాయిలో ఎన్నికల కంట్రోల్‌ రూంను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు స్వీకరణ, సమస్యల పరిష్కార చర్యల నిమిత్తం 24గంటలూ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచే టీవీ, పత్రికలు, సోషల్‌మీడియాల్లో వస్తున్న ప్రకటనలు, వార్తలను అధికారులు భూతద్దంలో చూస్తున్నారు. ప్రతి ప్రకటన లేదా అనుమానిత కథనాలకు రేటు కడుతున్నారు. వాటిని నామినేషన్లు పూర్తయిన తరువాత అభ్యర్థుల ఖాతాల్లో జమచేసే అవకాశం ఉంటుంది. లేదా పార్టీల ఖాతాల్లోనైనా జమ అవుతాయి. దీనికి అనుసంధానంగా మీడియా సెంటర్‌ కూడా పక్కనే ఏర్పాటు చేశారు.

➡️