ప్లాస్టిక్‌ నిషేధం ఉందా..?

May 23,2024 21:35

ప్రజాశక్తి-పాలకొండ : పట్టణంలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా కూడా ఉత్పత్తి, వినియోగం మాత్రం ఆగడం లేదు. నగర పంచాయతీ అధికారులు, ఉద్యోగులు ప్లాస్టిక్‌ వినియోగంపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పొచ్చు. మొక్కుబడిగా షాపుల మీద దాడులు నిర్వహిస్తారని, అలా దాడి చేసే ముందు కూడా వ్యాపారస్తులకు ముందుగానే సమాచారం అందుతుందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీంతో వ్యాపారులు వారి జాగ్రత్తలో వారు ఉంటున్నారు. గతంలో పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌గా పని చేసిన లిల్లీ పుష్పనాథం ప్లాస్టిక్‌ నిషేధం కోసం పెద్ద యుద్ధమే చేసి సఫలీకతం అయ్యారు. మైక్రాన్లతో సంబంధం లేకుండా ఎటువంటి ప్లాస్టిక్‌ కవర్‌ కూడా పట్టణంలో కనిపించకుండా చేయడంలో ఆయన కషి ఆమోఘమని చెప్పొచ్చు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా బేఖాతరు చేస్తూ తన పని తాను చేసుకుని పోయారు. దీనితో పట్టణంలో ప్లాస్టిక్‌ నిషేధం ఒక కొలిక్కి వచ్చిందని అందరూ భావిస్తున్న తరుణంలో లిల్లీ పుష్పనాథం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తరువాత ఆ బాధ్యతలోకి వచ్చిన కమిషనర్లు ఎవరూ కూడా ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టిపెట్టలేదు. గతంలో ఉన్న నిషేధాన్ని కొనసాగించలేదనే అపప్రద అయితే మూట కట్టుకున్నారు. ఫలితంగా ప్లాస్టిక్‌ నిషేధిత పాలకొండ నుండి ప్లాస్టిక్‌ ఆధారిత పాలకొండగా పట్టణం రూపు మార్చుకుంది. లిల్లీ పుష్పనాథం తరువాత నగరపంచాయితీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు అధికారులలో ఇద్దరు ఎసిబి కేసులలో ఇరుక్కొన్నారు అంటే నగర పంచాయతీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వ్యాపారుల్లో కూడా నగర పంచాయతీ అధికారులంటే భయం పోయి తమ వ్యాపారాలను ప్లాస్టిక్‌ సంచులతో కొనసాగిస్తున్నారు. దాడులు చేసి ప్లాస్టిక్‌ని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాస్టిక్‌ నిషేధానికి నడుం బిగిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

➡️