రైతులను మోసగించిన జగన్‌

May 3,2024 22:28

 ప్రజాశక్తి- కొత్తవలస : నమ్మి ఓట్లేసి గెలిపించిన రైతులను సిఎం జగన్‌ నిలువునా మోసగించారని సినీనటుడు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. కొత్తవలస మండలంలో శుక్రవారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనను స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పిచ్చివాడు పరిపాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. బాబారుని చంపి, చెల్లిని పక్కన పెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బాలకృష్ణ.. సిఎం జగన్‌కు ప్రశ్నలు సంధించారు. ‘ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయ. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా?. జాబ్‌ కేలండర్‌ విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కల్తీ మద్యంతో కొన్ని లక్షల తాళిబొట్లు తెగిపడుతున్నాయి. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా?. చివరికి చెత్త మీద పన్ను వేశావ్‌.. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా?’ అంటూ సవాల్‌ చేశారు. దుర్మార్గమైన పాలనను ఓటు అనే పోటుతో మట్టి కరిపించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంబేద్కర్‌ విదేశీ విద్య పేరు మార్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికే సొంతమని ధ్వజమెత్తారు. ‘ఒక్క అవకాశం..’ అంటూ వచ్చి కోడి కత్తి, బాబారు హత్య ఘటనలతో గద్దెనెక్కారని, ఇప్పుడు గుళకరాయితో సానుభూతి పొందాలని చూస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. సినిమా డైలాగ్‌లతో అభిమానులను ఉర్రూతలూగించారు. తొలుత టిడిపి విశాఖ ఎమ్‌పి అభ్యర్థి శ్రీభరత్‌, శృంగవరపుకోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కష్ణ, నాయకులు ఇందుకూరి సుధారాణి, జనసేన నాయకులు ఒబ్బిన నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️