జగన్‌ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమే : బోళ్ళ

Dec 21,2023 15:23 #Konaseema

ప్రజాశక్తి-రాజోలు(కోనసీమ) : జగన్‌ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని దానికి నిదర్శనం యువగళం ముగింపు మహసభకు వచ్చిన జనసమూహమేనని టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిడిపి పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు బోళ్ళ వెంకట రమణ అన్నారు. గురువారం రాజోలు మండలం తాటిపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోళ్ళ వెంకట రమణ మాట్లాడుతూ.. అధికారంలో లేనప్పుడు రైతు రాజ్యం తీసుకొస్తానన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే రైతులు లేని రాజ్యాన్ని సృష్టించారన్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉండగా… కౌలు రైతుల బలవన్మరణాల్లో రెండో స్థానంలో నిలిచిందని రమణ అన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్కో రైతుపై రూ.75వేలు అప్పు ఉంటే.. జగన్‌ పాలనలో దాన్ని రూ.2.5 లక్షలకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో.. రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది రైతులపై అప్పుల పెరుగుదలలో మాత్రమే. ఏడాదికి రైతులకు కేవలం రూ.7,500 ఇచ్చి.. అదే సంక్షేమమనే భ్రమలో ప్రభుత్వం ఉందన్నారు. జగన్‌ పనైపోయిందని.. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తుఫాన్‌కు నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరమన్నారు. వైసిపి నాయకులు సరఫరా చేస్తున్న నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగుమందులతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారని.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్‌ కింద కేసులు కడతాంమని ప్రత్యేక చట్టం తీసుకువస్తాం అని వెంకట రమణ అన్నారు.

➡️