హామీ అమలు చేసే నాయకుడు జగన్‌ : రాజన్నదొర

May 6,2024 21:11

ప్రజాశక్తి – సాలూరు:  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మితే మోసపోతారని, మాట మీద నిలబడే నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తుండ, మావుడి, తోణాం, కొట్టు పరువు పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగారు. గిరిజన గ్రామాల్లో థింసా నృత్యంతో గిరిజన మహిళలు అడుగడుగునా నీరాజనం పట్టారు. ఆయన కూడా మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకు లేదని గత పాలన చూస్తే అర్ధమవుతుందని చెప్పారు. రైతులు, మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసగించిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైసిపి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి మభ్యపెట్టడం టిడిపి నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. అన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు వంతెనల నిర్మాణానికి కోట్లాది రూపాయల ఖర్చు చేసినట్లు తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని రాజన్నదొర చెప్పారు. కార్యక్రమంలో సర్పంచులు పీడిక సుదర్శనరావు, మువ్వల ఆదియ్య,నూకయ్య, ఎస్టీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ కొండ గొర్రి ఉదరు కుమార్‌, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షులు పువ్వాడ రామకృష్ణ పాల్గొన్నారు.పెదపదంలో….మండలంలోని పెదపదంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, సర్పంచ్‌ రెడ్డి సుకన్య ఎన్నికల ప్రచారం చేశారు. బాగువలస ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే రాష్ట్రం లో సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కావాలని కోరారు. ప్రచారంలో మాజీ సర్పంచ్‌ భాస్కరరావు పాల్గొన్నారు.మక్కువ : ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించాలని వైసిపి మండల నాయకులు ఎం.రంగు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మక్కువలో సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్తూ సాలూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పి.రాజన్నదొరను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమం లో అధిక సంఖ్యలో వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.పింఛను ఇంటికి రాలేదని వృద్ధుడి ఆవేదన సాలూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం మండలంలోని మరిపిల్లి, మామిడిపల్లిలో డిప్యూటీ సీఎం రాజన్నదొర ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మరిపిల్లిలో 85 ఏళ్ల గిరిజన వృద్ధుడు జాడ చిన్నయ్య వద్దకు రాజన్నదొర వెళ్లి ఓటు వేయాలని కోరగా, ఆయన తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కదల్లేని పరిస్థితిలో ఉన్నానని, పింఛను డబ్బులు బ్యాంక్‌ ఖాతాలో వేశామని చెప్పారని రాజన్నదొర దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో చిన్నయ్య పరిస్థితి చూసి చలించిపోయిన రాజన్నదొర ఆయన్ను ఓదార్చారు. నెలరోజుల్లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఇంటికి ఫించన్‌ వస్తుందని చెప్పి భరోసా ఇచ్చారు. టిడిపి నాయకుల ఫిర్యాదు వల్ల పింఛన్లు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారని, వాలంటీర్లను పంపిణీ నుంచి తప్పించారని రాజన్నదొర చెప్పారు.

➡️