జిందాల్‌ చర్చలు విఫలం

May 21,2024 21:24

 ప్రజాశక్తి – కొత్తవలస : జిందాల్‌ కార్మిక సమస్యలపై విజయనగరం డిసిఎల్‌ వద్ద మంగళవారం యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు చేసిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలకు కంపెనీ నుంచి డిజిఎం హెచ్‌ఆర్‌ గోపాలకృష్ణ, మేనేజర్‌ సన్యాసినాయుడు పాల్గొనగా, కాంట్రాక్టు వర్కర్స్‌ నుంచి పి. వెంకటేష్‌, బి. రామచంద్రరావు, కార్మికుల నుంచి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు నెక్కల నాయుడు బాబు, కె.సురేష్‌, పిల్ల అప్పలరాజు, ఇతర కార్మికులు పాల్గొన్నారు. చర్చలు విఫలం కావడంతో కార్మికులు వెనుదిరిగారు. గత ఐదు రోజుల నుంచి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేస్తున్నప్పటికీ యాజమాన్యం కనీసం స్పందించకుండా వ్యవహరించిన తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. వంటావార్పు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహిస్తున్నారు. కనీసం కార్మికులకు విషయం చెప్పకుండా, లేఆఫ్‌ ప్రకటించడానికి గల కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు. డిసిఎల్‌ వద్ద జరిగిన చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా విఫలమయ్యాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గాడి అప్పారావు, బొట్ట రాము, నమ్మి చినబాబు, బాలిబోయిన ఈశ్వరరావు, సలాది భీమయ్య తదితరులు పాల్గొన్నారు.పరిశ్రమ వద్ద కొనసాగుతున్న వంటా వార్పుజిందాల్‌ పరిశ్రమ వద్ద ఐదో రోజు కూడా కార్మికుల వంటావార్పు కొనసాగుతుంది. కార్మికులు ఆందోళన చెందనవసరం లేదని, పరిశ్రమను భేషరతుగా తెరిచే వరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు.

➡️