పర్చూరులో టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-చిన్నగంజాం: పర్చూరు వైసిపికి భారీ షాక్‌ తగిలింది. స్వయానా బాలినేని ప్రణీత్‌ రెడ్డి చక్రం తిప్పినా ఫలితం లేదు. మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వైసిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దగంజాం సర్పంచ్‌ నక్కల కృష్ణ, పెద్దపల్లిపాలెం సర్పంచ్‌ సైకం మణి, చిన్నగంజాం మాజీ జెడ్పిటిసి కొక్కిలిగడ్డ విష్ణు నారాయణ, మాజీ సర్పంచ్‌లు రాజు, బంగారు పాలెంకు చెందిన కుక్కల బురకాయలరెడ్డి, పెద్దగంజాం మాజీ సర్పంచ్‌ ఆట్ల పెద్ద సిద్ధారెడ్డి, చిన్నగంజాం మాజీ సర్పంచ్‌ కుంభ నాగమణి, ఎంపీటీసీ మనపోలు రాంబాబురెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఆసోది వెంకటేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే చిన్నగంజాం మండల పరిధిలోని పెద్దగంజాం పెద్దపల్లెపాలెం, రాజు బంగారు పాలెం, మోటుపల్లి, కొత్తపాలెం రామచంద్రయ్య నగర్‌, మున్నంవారిపాలెం, చిన్నగంజాం గ్రామాలకు చెందిన వెయ్యి మంది ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ చిన్నగంజాం మండలం ప్రజల చిరకాల స్వప్నం ఎన్టీఆర్‌ వారధిని నిర్మించి మళ్లీ ఓటు అడుగుతానని చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి మళ్లీ ఎన్నికల్లో ఆ బ్రిడ్జిపై నడుచుకుంటూ వచ్చి ఓటు అడిగానని గుర్తు చేశారు. చిన్నగంజాం మండల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 32 ఎకరాలలో ట్యాంకు నిర్మాణం చేపట్టి సురక్షిత నీరు అందించారని వివరించారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక స్వావలంబనకు అద్భుతమైన ప్రణాళిక రచించినట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు నాయకులందరూ కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోద వీరయ్య, సర్పంచ్‌ సాంబశివరావు, ఎంపీటీసీ పీత భార్గవి, మాజీ ఎంపీటీసీ రాములు, శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

➡️