పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా తీర్పు ఉండాలి

May 12,2024 00:01 #CITU, #meeting, #steel
steel citu

 ప్రజాశక్తి-ఉక్కునగరం : కేంద్ర, రాష్ట్ర పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా స్టీల్‌ ఉద్యోగుల తీర్పు ఉండాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ అభ్యర్థించారు. స్టీల్‌ప్లాంట్‌లోని డబ్ల్యూఆర్‌ఎమ్‌ క్యాంటీన్‌ వద్ద శనివారం స్టీల్‌ సిఐటియు మిల్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అయోధ్యరామ్‌ హాజరై మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ నేటి పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రాజకీయ నిర్ణయాలే ప్రధాన కారణమన్నారు. ఈ రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా మనందరి తీర్పు రేపు జరగబోయే ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపిస్తేనే పాలకుల నిర్ణయాలు మారుతాయని చెప్పారు. ప్లాంట్‌ను రక్షిస్తామని హామీ ఇచ్చిన ఇండియా కూటమికి మద్దతునివ్వాలని కోరారు. పోరాటాలను బలపరుస్తూ ఉన్న సిపిఎం గాజువాక అభ్యర్థి మరడాన జగ్గునాయుడును గెలిపించడం ద్వారా ఇక్కడి ప్రజలలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే దృఢమైన నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంకేతంగా పంపాలని కోరారు. ఈ ఎన్నికల్లో తీర్పుపైనే ప్లాంట్‌, మనందరి భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన ప్లాంట్‌లోని కోకో ఒవెన్‌, సింటర్‌ ప్లాంట్‌, టిపిపి, ఎస్‌ఎంఎస్‌, సిఎంఎస్‌ తదితర విభాగాలలో సమావేశాలు నిర్వహించారు. స్టీల్‌ సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైటిదాస్‌, యు రామస్వామి తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశాలలో ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు మిల్స్‌ కమిటీ నాయకులు డి.సత్యనారాయణ, కె.బాలశౌరి, వి.మురళి, బిఎన్‌.మధుసూదన్‌, కోయిలాడ శ్రీనివాస్‌, సిహెచ్‌ అరుణ్‌, వి.ప్రసాద్‌, రాజు, అప్పలరాజు, నాగబాబు తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️