వైసిపి సిట్టింగుల్లో గుబులు

రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపి సిట్టింగుల్లో గుబులు రేగుతోంది. వైసిపి అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సర్వే ఆధారంగా టికెట్లు ఖరారు చేయనుండడం ఆందోళనకు కారణమని తెలుస్తోంది. సర్వేలను ఆధారం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 72 మందికిపైగా అభ్యర్థులను మార్చనున్నట్లు అందుతున్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఎమ్మెల్యేల్లో అయోమయం నెలకొంది. ఐదు అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఆశావహులు అభ్యర్థిత్వానికి నువ్వానేనా అనే రీతిలో కొనసాగుతుండడం కంటిమీద కునుకుపడని పరిస్థితి నెలకొంది. వీరందరూ సిఎం ఫేషీలోని ఓ కీలక ఐఎఎస్‌ అధికారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు సమాచారం.ఉమ్మడి జిల్లాలో టికెట్ల ఫైట్‌ పతాకస్థాయికి చేరుకుంది. ప్రతిపక్ష టిడిపి, జనసేన సమన్వయంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో వైసిపి అప్రమత్తమైంది. ప్రతిపక్ష పార్టీల పొత్తు ప్రభావం కని పించే ప్రాంతాలపై దృష్టి సారించింది. కడప జిల్లాలో కడప, పులివెందుల, బద్వేల్‌, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి మినహా మిగిలిన ప్రాంతాలపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే గడప గడపకూ పేరుతో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసింది. వెనుకబడిన ఎమ్మెల్యేలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.వైసిపిలో నువ్వానేనా మూడు నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టికెట్లు లభించని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తోంది. కడప జిల్లా పరిధిలోని కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, అన్నమయ్య జిల్లాలో రాజంపేట, మదనపల్లి ఎమ్మెల్యేల టికెట్లు కేటాయింపులపై నీలినీడలు అలముకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలోని మైదుకూరు, కమలాపురం అభ్యర్థులను పిలిపించుకుని చర్చించినట్లు సమాచారం. పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేల్‌, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి మినహా కడపలో డిప్యూటీ సిఎం, ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఖలీల్‌బాషా కుమారుడు, ఇతర మైనార్టీ నాయకునితో కలిపి ఐదుగురు, కమలాపురంలో ఎంఎల్‌ఎతో పాటు, ఆయన సమీప బంధువు ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, సహా మరొకరు, మైదుకూరులో ఎమ్మెల్యే కుమారుడు, సిఎం సమీప బంధువులు ఇద్దరు, జమ్మలమడుగులో ఎమ్మెల్యేతోపాటు పులివెందులకు చెందిన కీలక నేత, రాజంపేటలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమరనాధరెడ్డి, వీరబల్లి ప్రాంతానికి చెందిన నాయకుడు, మదనపల్లిలో ఎమ్మెల్యేతోపాటు మరో మైనార్టీ నాయకులు నిసార్‌అహ్మద్‌ వంటి ఆశావహులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కేటాయించడంపై గందరగోళం నెలకొంది.సర్వేలతోనే దిశానిర్దేశం అధికార వైసిపిలో సర్వేల ఆధారంగానే టికెట్లు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు, ఐదు సర్వేలను ముందు ఉంచుకుని నియోజకవర్గాల వారీగా సర్వేలు తేల్చిన ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో మైదుకూరు, అన్నమయ్య జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యేలు గడప గడపకూ కార్యక్రమంలో ఆశించిన పనితీరు ప్రదర్శించడంతో నిర్లక్ష్యం నెలకొనడంతో గుర్తించి హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఓ ఐఎఎస్‌ చుట్టూ ప్రదక్షిణలుఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల కోసం సిఎం ఫేషీకి క్యూ కట్టినట్లు సమాచారం. ఆ ఐఎఎస్‌ ఆఫీసర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయన రాజకీయపరమైన అంశాలు తనకేమీ సంబంధమని వాపోతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల తాకిడికి భరించలేక కరోనా పేరుతో నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఏదేమైనా సర్వేల ఆధారంగా టికెట్లు ఖరారు చేస్తుండడంతో అధికార పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి టికెట్లు లభిస్తాయోననే టెన్షన్‌ నెలకొంది.

➡️