అభివృద్ధిపై చర్చించేందుకు జగన్‌ సిద్ధమా..?

Feb 19,2024 22:31
ఎవరి పాలనలో అభివృద్ధి అధికంగా జరిగిందో

ప్రజాశక్తి – జగ్గంపేట

ఎవరి పాలనలో అభివృద్ధి అధికంగా జరిగిందో చర్చించేందుకు సిఎం జగన్‌ సిద్ధమా..? అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. అభివద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్‌ రెడ్డితో చర్చించేందుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని అందుకు ఆయన సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దాం అందుకు సిద్ధమా అని నిలదీశారు. సిద్దం అని సభలు పెట్టి అబద్ధపు మాటలను వల్లివేస్తున్నాడని దుయ్యబట్టారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్‌ కు రాజకీయంగా చివరి చాన్స్‌ అవుతుందని, 2024 ఎన్నికల అనంతరం మూట, ముళ్లు సర్ధుకుని రాష్ట్రం విడిచిపోవడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్‌ మడత పెట్టేశాడని, మిగిలిన వాళ్లను, జగన్‌ రెడ్డిని 50 రోజుల్లో ఇక జనం మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్‌ సంక్షేమ గురించి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. సమాజానికి ఫోర్త్‌ పిల్లర్‌గా ఉన్న మీడియాపై తన రౌడీ మూకలు, గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో టిడిపి క్రిస్టియన్‌ విభాగం జిల్లా అధ్యక్షులు కన్నబాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు అడపా భరత్‌బాబు, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహన్‌రావు, సుంకవిల్లి రాజు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు మండపాక అప్పన్నదొర, పిటి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️