ఈసారీ నిరాశే…

Feb 7,2024 23:15
ఆర్థిక మంత్రి బుగ్గన

ప్రజాశక్తి- కాకినాడ, రాజమహేంద్రవరం ప్రతినిధులు

ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మరోసారి జిల్లా వాసులను నిరాశపరిచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు అధిక ప్రాధాన్యత ఉంటుందని భావించారు. ముఖ్యంగా పెండింగ్‌ ప్రాజెక్టులు గాని, ఇరిగేషన్‌ రంగానికి గాని ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. కోనసీమ రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాల్సి ఉంది. ఈ సారీ ఈ ప్రాజెక్టుకు నిధుల మాట ఎత్తలేదు. పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిపైనా సారీ అనేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో పురోగమనం, పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా చెప్పుకొన్నారు.గత కేటాయింపులకు సంబంధించి ఈ బడ్జెట్‌ లో నిధుల వినియోగం ఊసెత్తలేదు. గత బడ్జెట్‌ లో ఉప్పాడ హార్బర్‌ పనులకు నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాని ఈ ప్రాజెక్టుకి ఇప్పటి వరకూ 40 శాతం నిధులనే కేటాయించగా ఈ బడ్జెట్‌ లో మిగిలిన నిధుల గురించి ప్రస్తావన రాలేదు.కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను పూర్తి కావడం కోసం కోనసీమ ప్రజానీకం 22 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా రైల్వే బడ్జెట్‌ ల్లో మొత్తం రూ.1,100 కోట్లు కేటాయించింది. మొత్తం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. ఈ నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు సంబంధించిన నిధులు కేటాయింపు చేయని కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.350 కోట్లు రాష్ట్ర వాటా ఇవ్వాల్సి ఉంది. అయితే అనేక వినతులు ఇవ్వగా 55 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ లైన్‌ కు భూ సేకరణ చేస్తామని అందుకు అయ్యే ఖర్చును భరిస్తామని ప్రభుత్వం రైల్వేకు గతంలోనే తెలిపింది. ప్రస్తుతం భూ సేకరణ నత్తనడకన జరుగుతోందని కోనసీమ వాసులు చెబుతున్నారు. భూ సేకరణ నిధుల కేటాయింపుపై గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు కొనసాగింపుగా ఈ బడ్జెట్‌ లో నిధుల మాట ఎత్తలేదు.ఎక్కడి సమస్యలు అక్కడేవిశాఖ-కాకినాడ మధ్య పెట్రో రసాయనాల పెట్టుబడుల కేంద్రం వస్తుందని కాకినాడ జిల్లా వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాకినాడ సెజ్‌లో నేటికీ పరిశ్రమల జాడ కనిపించడం లేదు. జిల్లా వాసుల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు గత బడ్జెట్‌లో నిధులను కేటాయించినా పనులు నాటి నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో పలు రహదారుల పనులకు భారీగా సొమ్ములు కేటాయించాల్సి ఉంది. గతంలో నిధులను కేటాయించామని ప్రభుత్వం చెప్పిన నాటి నుంచి ఇప్పటివరకు రహదారుల పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. కాకినాడలో విడుదలయ్యే 50 మిలియన్‌ లీటర్ల వ్యర్ధ జలాలను శుద్ధి చేసేందుకు గతంలో రూ.10 కోట్లు వెచ్చించారు. కానీ నేటికీ నిధులను కేటాయించక పనులు ప్రారంభం కాలేదు. కాకినాడలో సైన్స్‌ సెంటర్‌, గోదావరి కళాక్షేత్రం, స్టేడియంలను ఇటీవల హడావుడిగా ప్రారంభిచినా ఇంకా బిల్లులు పెండింగులోనే ఉన్నాయని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.రైతుల ఆశలు ఆవిరి రైతుల కోసం రూ.33,300 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అత్యంత కీలకమైన ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ఆధునికీకరణకు చేతులెత్తేసింది. గతేడాది రూ.61 కోట్లు కేటాయించిన విషయం విధితమే. అయితే నిధులు కొరత వల్ల ఈ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. బ్యారేజీపై రోడ్డు మరమ్మతులు సైతం చేపట్టకపోవటంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. తాజా బడ్జెట్లోనూ నిధుల కేటాయింపు లేదు. దాదాపు 10 లక్షల ఎకరాలకు బ్యారేజీ నుంచి సాగునీటిని అందిస్తున్నారు. కీలకమైన గేట్ల ఆధునికీకరణను విస్మరించడంతో ఉమ్మడి జిల్లా వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏటా నిర్వహించాల్సిన కాల్వల పూడికతీత పనులు చేపట్టకపోవడంతో గోదావరి వరదలు, అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం తప్పడంలేదు. గోదావరిలో ఇసుక పూడిక తీత పనులు చేయడానికి గతంలో టెండర్లు పిలిచారు. కాని బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక (ఎన్‌ఆర్‌సిపి) కింద ‘గోదావరి నది కాలుష్య నివారణ, పరిరక్షణ’ ప్రాజెక్ట్‌ కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2022లో రూ.88.43 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.416 కోట్లుగా అంచనా వేశారు. కాని కేంద్రం రూ.88.43 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో సంయుక్తంగా చేపట్టాలి. రాష్ట్ర వాటా నేటికీ కేటాయించలేదు. పారిశ్రామిక అభివద్ధి, ఉపాధి కల్పన ఊసే ఎత్తలేదు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, అలాగే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.6.50 లక్షలకు బదులు రూ.10 లక్షల ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ గతంలో హామీ ఇచ్చిన ఈ బడ్జెట్లోనూ స్పష్టమైన హామీ ఇచ్చిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించడంతో జిల్లా రైతాంగం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. యువతకు ఉపాధి కల్పించే రంగాన్ని విస్మరించారు. స్థూల ఆదాయంపై అంకెల గారడి వినిపించారు. ఇళ్ల నిర్మాణానికి కేటాయింపులు సాధారణంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న అరకొర సొమ్ములు లబ్ధిదారులు కనీసం పునాదులు కట్టుకోవడానికి కూడా సరిపోని పరిస్థితులు ఉన్నాయి. ఈ బడ్జెట్‌ లోనైనా తగిన నిధులు కేటాయిస్తారని లబ్ధిదారులు ఆశించి భంగపడ్డారు.

➡️