ఊపందుకోని నిర్మాణాలు

Feb 23,2024 22:44
ఊపందుకోని నిర్మాణాలు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగం బాగా కుదేలయ్యింది. ఇసుక పాలసీ పేరుతో కార్మికుల ఉపాధిని దెబ్బ తీసింది. ఇసుక పంపిణీ భాధ్యతను ప్రయివేటు సంస్థలకు అప్పగించడంతో డిమాండుకి తగ్గ ఇసుక సరఫరా చేయకుండా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ ఇళ్ల నిర్మాణం అత్యంత ఖరీదుగా మార్చేశారు. దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. అడపా దడపా పనులు ఉంటున్నా కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రస్తుతం సిమెంటు, ఐరన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. సిమెంట్‌ రూ.290 నుంచి 330 వరకూ ఆయా కంపెనీలను బట్టి ఉండేవి. ప్రస్తుతం రూ.20 వరకూ తగ్గింది. గతేడాది రూ.350 నుంచి 370 వరకూ అమ్మేవారు. ఐరన్‌ ధరలు గతేడాది రూ.65 వేల నుంచి రూ.68 వేల వరకూ అమ్మేవారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు రూ.63 నుంచి 64 వేలు ఉండేది. ప్రస్తుతం రూ.58 నుంచి రూ.60 వేలకు తగ్గింది. నిర్మాణదారులు వెనుకడుగునిర్మాణాలకు డిసెంబర్‌ నుంచి మే నెల వరకూ అనుకూలమైన కాలం. ఈ నేపథ్యంలో సిమెంటు ఐరన్‌ ధరలు పెరుగుదల అనివార్యంగా ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ ధరలు తగ్గుముఖం పట్టినా నిర్మాణాలు ఊపందుకోలేదు. నిత్యా వసరాల ధరలు పెరుగుదల వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం దానికి తోడు ఆదాయం కూడా బాగా తగ్గడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. కాయగూరల ధరల సైతం దిగి రానంటున్నాయి. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం సామాన్యులను వేధిస్తోంది. ఛార్జీల మోత, విద్యుత్తు బిల్లుల పెంపు వంటి కారణాల వల్ల కుటుంబ పోషణ కూడా కష్టమవుతుంది. మరోవైపు భవన నిర్మాణానికి ఉపయోగించే ఇతర సామాగ్రి ధరలు దిగి రాలేదు. నాలుగేళ్ల క్రితం రెండు సెంట్లలో ఇంటికి ఎటువంటి హంగులూ లేకుండా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఖర్చు అయ్యేది. కొంతకాలంగా ధరల పెరుగుదలతో రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షలు వ్యయం చేస్తేనే గాని ఇల్లు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఇటుక ధర రూ.5 వేలు ఉండేది. ఇప్పుడు రకాలను బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ పెరిగింది. ప్లంబ్లింగ్‌, వైరింగ్‌, మెటీరియల్‌, స్విచ్‌ బోర్డులు, విద్యుత్‌ వైర్లు, అల్యూమినియం కిటికీలు, తలుపులు, టైల్స్‌, పెయింట్స్‌ ఇలా అన్ని ధరలు రెండు రెట్లు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. 20 టన్నుల ఇసుక రూ.10 వేలు ఉండేది. ప్రస్తుతం సుమారు రూ.22 వేలకు పెరిగింది.కార్మికులకు అరకొర ఉపాధిమెటీరియల్‌ ధరలు పెరుగుదల నిర్మాణదారులకు మోయలేనంత భారంగా మారింది. నిర్మాణం వ్యయం రెండింతలు పెరగడంతో సామాన్యులు, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు, వెంచర్లను చేపట్టిన బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులను నిలిపివేసిన కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువవుతోంది. నిర్మాణ రంగంపైనే ఆధారపడిన 42 రకాల కార్మికులకు అరకొర పనులకే పరిమితం అవుతున్నారు.

➡️