‘కాక’నాడి

Mar 22,2024 00:01
అతి సామాన్యుడి నుంచి

పజాశక్తి – కాకినాడ ప్రతినిధి

అతి సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు అందరూ హాయిగా బతకగలిగే నగరంగా, పెన్షనర్స్‌ పారడైజ్‌గా పిలువబడే కాకినాడ సిటీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయం మరింత హీటెక్కింది. అధికార, ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. మరోసారి పట్టు నిలుపుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుండగా అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రతిపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట ముందుగానే వైసిపి అధిష్టానం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మళ్ళీ బరిలో నిలుచుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నుంచి అభ్యర్థి ఇంకా ఎవరనేది స్పష్టత రాలేదు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందో అదే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనేది నానుడి. గత ఎన్నికల్లో 19కి గానూ 15 స్థానాల్లో వైసిపి విజయదుందుభి మోగించింది. ఫలితంగా వైసిపి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించి మళ్లీ పాగా వేయాలని వైసిపి వ్యూహరచన చేస్తోంది. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని అధిక స్థానాలను సాధించాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమి పావులు కదుపుతోంది. దీంతో కాకినాడ సిటీ నియోజకవర్గం రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఈ నియోజకవర్గంలోని 233 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 1,13,177 మంది పురుషులు, 1,23,166 మంది స్త్రీలు, 94 మంది ఇతరులు మొత్తంగా 2,36,437 మంది ఓటర్లున్నారు. ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కాకినాడ జిల్లా కేంద్రానికి ప్రత్యేకత సంతరించుకుంది. గెలుపు గుర్రం ఎవరో..?సిటీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఉన్న ఎంఎల్‌ఎ ద్వారంపూడి సిఎం జగన్మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన్ను ఢకొీట్టే బలమైన అభ్యర్థి కోసం టిడపి, జనసేన, బిజెపి కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ద్వారంపూడి గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో జరిగిన వారాహి యాత్రలో ద్వారంపూడిపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన పర్యటనల్లో కూడా ద్వారంపూడి వ్యవహారాన్ని దుయ్యబెట్టారు. దీంతో సిటీ నియోజకవర్గంలో ద్వారంపూడిని ఎలాగైనా ఓడించి కూటమి విజయం సాధించాలని భావిస్తోంది. టిడిపి నుంచి మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబుకే టిక్కెట్‌ దక్కుతుందనే అభిప్రాయాలు ఆ పార్టీ శ్రేణుల నుంచి విన్పిస్తుంది. ద్వారంపూడికి సరైన ప్రత్యర్థి కొండబాబే అనే అభిప్రాయాలు లేకపోలేదు. అయితే ఆయన ఆశించిన స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. సిటీ నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ అరాచక పాలన సాగిస్తున్నారని, కనపడిన చోటల్లా భూ కబ్జాలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను కైవసం చేసుకుంటున్నారంటూ సందర్భం వచ్చినప్పుడల్లా కొండబాబు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించాలంటే కొండబాబుకి ఇప్పుడున్న బలం సరిపోదనే సంకేతాలు టిడిపి అధిష్టానానికి చేరాయి. అందుచేతనే కాకినాడ జిల్లాలో కూటమి అభ్యర్థులు అందర్నీ ప్రకటించినప్పటికీ సిటీ నియోజకవర్గ అభ్యర్థిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కొండబాబుకి కాకుండా ఆయన సోదరుడు కుమార్తె సుస్మితకు ఇస్తే ఎలా ఉంటుందని అంశంపై టిడిపి క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తుంది. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుణ్ణం చంద్రమౌళి కూడా టికెట్‌ ఆశిస్తూ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయన పెద్దాపురం టిక్కెట్లు కోరినప్పటికీ చంద్రబాబు మూడోసారి కూడా చిన్నరాజప్పనే ప్రకటించడంతో నిరాశ చెందారు. సిటీ నియోజకవర్గంలోనైనా టికెట్‌ కేటాయించాలని పట్టుదలతో ఆయన చేయని ప్రయత్నాలు లేవని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో బిజెపి ఒక స్థానాన్ని కోరుతున్న నేపథ్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని తమకే ఇవ్వాలని పట్టు పడుతున్నట్లు సమాచారం. ఒకవేళ బిజెపికి గనుక అవకాశం ఇస్తే ఈ సీటును పోతులు విశ్వం, గట్టి సత్యనారాయణ, మాజీ ఎంఎల్‌ఎ ముత్తా గోపాలకష్ణ కుమారుడు ముత్తా నవీన్‌ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరికి సీటు దక్కుతుందో, ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.

➡️