డిమాండ్లు నెరవేర్చాలని సర్పంచుల ధర్నా

Mar 1,2024 22:47
డిమాండ్లు నెరవేర్చాలని సర్పంచుల ధర్నా

ప్రజాశక్తి-కాకినాడతమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో సర్పచుంలు శుక్రవారం కాకినాడలో ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు ర్యాలీగా వస్తున్న సర్పంచులను కలెక్టరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలోనికి వెళ్లకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సర్పంచులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అప్పటికే టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి రావడంతో ఉద్రిక్తత బాగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సర్పంచులు నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర పంచాయతీ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవిబి.రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి ప్రసంగించారు. గత మూడేళ్లుగా తమ గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోకపోగా రోడ్లు, కాలువలు, తాగునీరు, వీధి దీపాలు వంటివి ప్రజలకు సమకూర్చలేక ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసిన ప్రజలు తమను తిడుతున్నా ఏమీ చేయ లేకపోతున్నామని వాపోయారు. పంచా యతీలకు ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకపోగా ఇతర ఆదాయం ద్వారా వచ్చే తమ సొంత నిధులను, కేంద్ర ప్రభుత్వం తమ గ్రామాల అభివద్ధి కోసం పంపిన 14, 15వ ఆర్థిక సంఘం నిధుల రూ.వేల కోట్లను వైసిపి ప్రభుత్వం దొంగిలించి తన సొంత పథకాలకు అవసరాలకు దారి మళ్లించి వినియోగించుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ గృహసారథులు, కన్వీనర్లను కొత్తగా ప్రవేశపెట్టి పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల హక్కులు, అధికారాలను తుంగలో తొక్కిందన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. జల్లి బాలరాజు, ఉపాధ్యక్షుడు వై.వినోద్‌ రాజు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌.శాంతకుమారి, రంబాల రమేష్‌ కుమార్‌, నాయకులు చుక్కా ధనంజయ యాదవ్‌, ప్రభాత్‌, నందమూరి రాజా, చిక్కం దొరబాబు, పెద్దిరెడ్డి రాము పాల్గొన్నారు.

➡️