డ్రైవర్ల మెడపై హిట్‌, రన్‌ చట్టం..

Feb 15,2024 23:31
ఉరితాడుగా మారనుంది.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

కేంద్రంలోని బిజెపి సర్కార్‌ తీసుకొచ్చిన ‘హిట్‌ అండ్‌ రన్‌’ చట్టం డ్రైవర్ల మెడకు ఉరితాడుగా మారనుంది. ఊహించని రీతిలో జరిగే ప్రమాదాలకు డ్రైవర్లనే బాధ్యులను చేస్తూ తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా శిక్షలతోపాటు, జరిమానాలను భారీ ఎత్తున వేసేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం విస్తరించాల్సి వుంది. కేంద్రం చేయాల్సిన వాటిని పక్కన పెట్టి అనుకోకుండా జరిగే ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేయడాన్ని ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఇతర రవాణా కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెను చేపడుతున్నారు. కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 10 టన్నుల కెపాసిటి గల టిప్పర్‌, క్వారీ లారీలు 6 వేలు, 20 టన్నుల కెపాసిటి గల మార్కెట్‌ లారీలు 3 వేలు ఉన్నాయి. ఒక్కో లారీకి డ్రైవర్‌, క్లినర్‌లు నలుగురు, యజమాని, దానిపై పనిచేసే కూలీలు మరో నలుగురు ఇలా 10 మంది వరకూ ఆధారపడుతుండగా సుమారు 95 వేల మంది ఈ రంగంపై ఆధారపడి కుటుంబాలను పోషిచుకుంటున్నారు. మూడు జిల్లాల్లో రావులపాలెం, జొన్నాడ, ఆత్రేయపురం మండలం అంకంపాలెం, పి.గన్నవరం, ముమ్మిడివరం, కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, చిత్రాడ, ప్రత్తిపాడు, తుని, ఏలేశ్వరం, పెద్దాపురం, సామర్లకోట తదితర మండలాల్లో లారీలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 40 వేలు ఆటోలుండగా వీటిపై దాదాపు 50 వేలమంది ఆధారపడి ఉన్నారు. ఇవి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే 407 మోడల్‌ గల వాహనాలు 2 వేలు ఉండగా 4 వేల మంది, సుమారు 2 వేలు గూడ్స్‌ ఆటోలుండగా వీటిపై ఆధారపడి 2 వేల మంది భ్రతుకుతున్నారు. ఇప్పటికే రవాణా రంగం కోలుకోలేని దెబ్బ తగిలి కొట్టుమిట్టాడుతుంది. కొత్త చట్టంతో మరిన్ని చిక్కులువివిధ భారాలతో కోలుకోలేని దెబ్బకు గురైన రవాణా రంగం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానాల వలన మరింత కుదేలవుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం ప్రమాదాల్లో రెండు శాతంగా ఉన్న జాతీయ రహదారుల్లోనే 67 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహ దారుల విస్తరణ యుద్ధ ప్రాతిపదికన నిర్మించా ల్సిందిపోయి హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తీసుకొచ్చి ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చే యాలని చూస్తోంది. దీనిని రవాణా రంగ కార్మికులంతా వ్యతిరే కిస్తున్నారు. జాతీయ రహ దార్లపై ఎక్కడా డ్రైవర్లకు విశ్రాంతి సదు పాయం ఏర్పాటు చేయ కుండా జాతీయ రహదా రుల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. డ్రైవర్లకు విశ్రాంతి లేని పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నేషనల్‌ పర్మిట్లు కలిగి రాష్ట్రాలు దాటివెళ్లే రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్భం తొలగించడం కూడా ప్రమాదాలు పెరగడానికి కారణమ వుతుందని డ్రైవర్లు, ఫెడరేషన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ 100 కిలోమీటర్లకు 28 యూటర్న్‌లను జాతీయ రహదారులపై ప్రభుత్వమే ఏర్పాటు చేయిస్తుండడం శోచనీయమని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. విస్తృత ప్రచారంట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె జయప్రదానికి గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. కాకినాడ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సమ్మెకు సంబంధించిన ప్రచారం సాగింది. రవాణా రంగంలోని అన్ని రకాల కార్మికులకు సిఐటియు, ఇతర ప్రజా సంఘాల నాయకులు కరపత్రాలను పంచి సమ్మె ఎందుకు చేస్తున్నామనే దానిపై ఇప్పటికే అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వలన భవిష్యత్తులో కలిగే నష్టాలను వివరిస్తూ పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్‌, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో కార్మికులకు అవగాహన కల్పించారు. కాకినాడ పోర్టులో ఉన్న పలు యాజమాన్యాలకు సమ్మెకు సంబంధించి నోటీసు లు ఇచ్చి రవాణా రంగ కార్మికులను సమాయత్తం చేశారు.మొత్తంగా శుక్రవారం జరగనున్న ట్రాన్స్‌ పోర్ట్‌ కార్మికుల సమ్మెను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు రవాణా రంగ కార్మికులు సన్నద్ధమయ్యారు.

➡️