సమస్యలు పరిష్కరించాలని ఆశాల ధర్నా

Feb 1,2024 22:40
సమస్యలు పరిష్కరించాలని ఆశాల ధర్నా

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్‌, అర్బన్‌ మండలాలకు సంబంధించిన ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ గత నెల నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఉన్న సమస్యలపై మూడుసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. ఆశా వర్కర్లపై పని ఒత్తిడి, అధికారుల వేధింపులు బాగా పెరిగాయన్నారు. వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. తమకు సంబంధం లేని పనులు ఆన్‌లైన్‌ వర్కులు చేయాలని, 20 రికార్డులు నిర్వహించాలని, ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పారు. అధికారుల వేధింపుల వల్ల తూరంగి పిహెచ్‌సిలో ఆశా వర్కర్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఆమె సమస్యను ఇంతవరకు పరిష్కరించ లేదన్నారు. అనంతరం అధికారులు వచ్చి నాయకులను చర్చలకు పిలిచారు. సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో ఎం.భారతి ప్రియ, మొగలి బేబీ, లక్ష్మి, సత్యవతి, అంకాడి పద్మావతి, చెక్కల వేణి, సత్యవేణి, రామలక్ష్మి, భార్గవి, రష్మి పాల్గొన్నారు.

➡️