8న విజయవాడలో ఆశాల మహా ధర్నా

Jan 31,2024 22:57
తమ న్యాయమైన డిమాండ్ల

ప్రజాశక్తి – కాకినాడ

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8న విజయవాడ కేంద్రంగా జరుగుతున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ పిలుపునిచ్చారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిఎం అండ్‌ హెచ్‌ఒకు బుధవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్స్‌కి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని, రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ ఇవ్వాలను విజయవాడలో మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి పలు రూపాల్లో తమ డిమాండ్లను తీసుకెళ్లామని, అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవంతోనే మహాధర్నాను చేపడుతున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాతే రూ.10 వేలు వేతనం ఇస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్నదని, అయితే వారి పాలనలోనే నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నది గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమకు దక్కకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రభుత్వ మోసకారితనాన్ని ఎండగట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ వర్కర్లందరూ ఫిబ్రవరి 8న విజయవాడలో జరిగే మహా ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా నాయకులు సూరాడ సీతారత్నం, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణి, గమ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️