దళిత యువకులపై దాడి

Apr 7,2024 23:04
ఉమ్మడి తూర్పు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరం గ్రామ దళిత యువకులపై పెత్తందారులకు చెందిన కొందరు యువకులు చేసిన దాడి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు తీవ్ర ఆందోళకరంగా మారింది. గతంలో కడియ మండలం పొట్టిలంక గ్రామంపై దళితులపై దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 8 మంది గాయపడిన ఘటన 2009 సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపింది. ఈ తరహాలోనే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కడియపు సావరం దళిత యువకులపై వ్యూహాత్మంగా దాడి జరిగింది. దీనిపై జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు పలువురు నాయకులు మౌనంగా ఉండటం చర్చానీయాంశంగా మారింది. దాడి జరిగి 24 గంటలైనా ప్రధాన వార్తాస్రవంతిలోగాని, సోషల్‌ మీడియాలో గాని కకనీస సమాచారం లేకపోవడం విస్మయాన్ని గురిచేస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గతంలో అనేక దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. శనివారం రాత్రి కడియం మండలంలోని కడియపు సావరం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు జాగారంలో భాగంగా గ్రామానికి చెందిన దళిత యువకులు పాల్గొన్నారు. గతేడాది ఇదే జాతరలో దళితులు, పెత్తందారుల యువకుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యం ఉంది. ఈ ఏడాది జాతరలో భాగంగా దళిత యువకులను లక్ష్యంగా చేసుకుని శనివారం రాత్రి 11 గంటల ప్రాంతం నుంచే పెత్తందారులకు చెందిన కొందరు యువకులు తొలుత కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ కవ్వింపు చర్యలు మితిమీరాయి. 12 గంటల ప్రాంతంలో 10వ తరగతి దళిత విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని దళిత యువకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట కాస్తా దాడికి దారి తీసింది. ముందస్తుగా దాడి చేయాలనే పథక రచన చేసుకున్న పెత్తందార యువకులు ఒక్కసారిగా ఇటుక రాళ్లు, గాజు సీసాలతో దళితులపై దాడులకు దిగారు. యువకులు తేరుకునే లోపే క్షణాల్లో దాడి చేసి పరారయ్యారు. దీంతో కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నుంచి అదనపు బలగా లను హుటాహుటిన కడియపు సావరం గ్రామానికి తరలించారు. అప్పటికే దాడిలో గాయాలపాలైన దళిత యువకులను శీలం రాజేష్‌, రేగుళ్ల కార్తీక్‌, శీలం నరసింహం, రేగుళ్ల మహేష్‌, రేగుళ్ల సురేష్‌లతోపాటు, మరికొంత మంది యువకులు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సెల్‌ఫోన్లను సైతం లాక్కున్నారు. తీవ్రంగా గాయపడిన శీలం రాజేష్‌, రేగుళ్ల కార్తీక్‌లను వైద్య సహాయం నిమిత్తం తరలించాలని వేడుకున్నా పోలీసులు వారిని కాలు కదపనివ్వలేదు. బాధితుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు కడియం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదనపు బలగాలతోపాటు పోలీసు ఉన్నతాధికారి కడియపు సావరం గ్రామానికి చేరుకుని గ్రామాన్ని దిగ్భంధనం చేశారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులను గ్రామం విడిచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. అనంతరం తెల్లవారు జాము 4 గంటల సమాయానికి పోలీసు ఉన్నతాధికారికడియం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనంతరం కడియం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను గంటలపాటు పోలీస ్‌స్టేషన్లోనే నిర్బంధించిన పోలీసునలు దాడికి పాల్పడిన వారిని మాత్రం అదుపులోకి తీసుకోక పోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రధాన వార్తా స్రవంతిలో గాని, సోషల్‌ మీడియాలో గాని వైరల్‌ కాకుండా పోలీసులతోపాటు, కొందరు స్థానిక రాజకీయ నాయకులు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దళితులపై ఒక సామాజికవర్గం జరిపిన వ్యూహాత్మక దాడిపై స్పందిస్తే ఒకవర్గం ఓట్లను దూరం చేసుకోవాల్సివస్తుందనే కారణంతోనే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు నోరు మెదిపేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజరుకుమార్‌ ఆదివారం మధ్యాహ్నం కడియం సిఐను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతర ముగిసేవరకూ సంయమనం పాటించాలని పోలీసులు కోరారు. దాడి ఘటనకు సంబంధించి సిసి పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని సిఐ తులసీధర్‌ తెలిపారు. వివాదానికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణపై కేసు నమోదు చేశామన్నారు. గాయపడిన దళిత యువకులను మెరగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. సౌత్‌ జోన్‌ డిఎస్‌పి అంబికాప్రసాద్‌ నగరంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న శీలం రాజేష్‌ను విచారించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడుల నేపథ్యంలో దళితులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొట్టిలంక ఘటన జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. ఈ దాడిపై సమగ్ర విచారణతోపాటు, వ్యూహాత్మకంగా దాడికి పాల్పడిన వారిని కఠిÄనంగా శిక్షించాలని ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దళితులు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️