మూతపడిన మున్సిపల్‌ ఆర్‌ఒ ప్లాంట్లు

May 15,2024 22:18
అసలే మండువేసవి,

ప్రజాశక్తి – సామర్లకోట

అసలే మండువేసవి, ముదురుతున్న ఎండలతో ప్రజలు గొగ్గోలు పడుతున్నారు. మరోవైపు తాగునీటి కోసం ప్రజలు ఆర్‌ఓ ప్లాంట్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ప్లాంట్‌ మూత పడింది. ప్లాంట్‌ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్య ధోరణిని అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజలు ప్రయివేట్‌ ప్లాంటులను ఆశ్రయించి చేతి చమురును వదిలించుకుంటున్నారు. పట్టణ ప్రజలకు రూ. 2లకే 20 లీటర్ల ఫిల్టర్‌ వాటర్‌ అందించేందుకు లక్షలు వ్యయంతో మున్సిపాలిటీ పరిధిలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో, బ్రౌన్‌ పేట డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ పార్క్‌లోను, గణపతి నగరం వాటర్‌ ట్యాంక్‌ల వద్ద ఆర్‌ఒ ప్లాంట్‌లను దాతల సహకారంతో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. అయితే బ్రౌన్‌ పేటలో ప్లాంటును నామమాత్రంగా ఏర్పాటు చేసి వదిలి పెట్టడంతో అది నిరూపయోగంగా మారింది. మిగిలిన రెండు యూనిట్ల విషయానికొస్తే వాటి నిర్వహణకు మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ శాఖకు చెందిన సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే వారు ప్లాంటులను తెరిచే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండటంతో అవి మూతపడుతున్నాయి. దీంతో ప్రజలు తాగునీరు విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ప్రత్యామ్నా యం కోసం మున్సిపాలిటీ ద్వారా అందించే ఆర్‌ఒ ప్లాంటుల వద్దకు వెళ్ళగా అవి మూతపడి ఉండటంతో తాగునీరు దొరకక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ప్లాంట్‌ పూర్తిగా మూతపడి ఉంటుందని ఏమని అడిగితే సిబ్బంది ప్రజలతో ఘర్షణకు దిగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో ప్రయివేట్‌ ప్లాంటులను ఆశ్రయించి తాగునీరు కొని తాగాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేట్‌ ప్లాంటుల యజమానులను ప్రోత్సహిం చేందుకు ఈ విధంగా మున్సిపల్‌ సిబ్బంది మున్సిపల్‌ ఆర్‌ఒ ప్లాంటులను మూసి వేస్తున్నారనే ఆరోపణలు పట్టణంలో విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్సిపల్‌ ఆర్‌ఒ ప్లాంటులను తెరిపించి వాటిద్వారా రక్షిత ఫిల్టర్‌ జలాలు తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ వివరణ

ఈ విషయమే ‘ప్రజాశక్తి’ మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామారావు వివరణ కోరగా నిన్నటి వరకు ఎన్నికల విధుల్లో ఉండిపోయామని, వాటర్‌ సప్లై సిబ్బందితో సమీక్షించి ఆర్‌ఒ ప్లాంట్లు సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని చెప్పారు.

➡️