రోగులకు భరోసాగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’

May 19,2024 22:41
కుటుంబ వ్యవస్థలో

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

కుటుంబ వ్యవస్థలో ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు ఉంటే 80 రోగాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సకాలంలో చికిత్స చేసి నయం చేసే అవకాశం ఉంటుందని డాక్టర్‌ అడ్డాల సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఫ్యామిలీ డాక్టర్‌ దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో ఫ్యామిలీ డాక్టర్‌, రోగుల కుటుంబాల మధ్య బంధం ఉండేదని ఏ జబ్బు వచ్చినా సరైన సమయంలో, నాణ్యమైన వైద్యం అందించే వారని అన్నారు. వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్రపై పూర్తి అవగాహన ఉండేదన్నారు. దీంతో ప్రాథమిక స్థాయిలోనే నవజాత శిశువు నుంచి వృద్ధుల వరకూ వచ్చే సాధారణ వ్యాధులను నయం చేసే వారని అన్నారు. కానీ నేడు ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ కనుమరుగవడంతో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సూపర్‌ స్పెషలిస్టుల దగ్గరకు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించే విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ ను ఏర్పాటు చేయడం అభినందినీయమని అన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్‌, ఎస్‌.శ్రీ నగేష్‌, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️