చేయి తడిపితేనే.. చేను తడిసేది…

Mar 22,2024 15:37 #Kakinada
  •  సాగునీరు లేక చేలు బీటలు వారుతున్నాయని రైతుల ఆవేదన.

ప్రజాశక్తి-తాళ్లరేవు: నీటిపారుదల శాఖ సిబ్బంది చేయి తడిపితేనే మా చేలు తడుస్తున్నాయని లేనియెడల పంట పొలాలు ఎండిపోవాల్సిందేనని రైతాంగం ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా వరి పొలానికి నీరు లేక బీటలు వారుతున్నాయని పలువురు రైతులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని చిన్న తూరతిప్ప ప్రాంతంలోని సుమారు 150 ఎకరాలు ఆరు తడి లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు దృష్టికి తీసుకువచ్చారు. డబ్బులు ఇచ్చిన వారికే ఇరిగేషన్ సిబ్బంది సాగునీరు వదులుతున్నారని, ఇల్ల నాగేశ్వరరావు, గుత్తుల మహేష్, కడియాల శ్రీను, తిరుకోటి అప్పారావు, పెద్దింశెట్టి రాము, గుత్తుల కృష్ణ, దొమ్మేటి సూర్య భగవాన్ సబ్బతి మావుళ్ళు తదితర రైతులు తెలిపారు. రిలయన్స్, ఓఎన్జిసి సంస్థలకు వేలాది క్యూసెక్కుల సాగునీరు తరలిస్తున్నారని రైతాంగానికి చుక్క నీరు ఇవ్వడం లేదని వాపోయారు. రైతులు ఆందోళన చేస్తే ఇటీవల గ్రాంట్, మా ప్రాంతంలోని రైతులకు ఓఎన్జిసి పైపులైను ద్వారా కొంత మేరకు నీరు అందించారని ఆ నీరు మా పంట పొలాలకు చేరేలోపే సాగునీటి సరఫరా నిలుపుదల చేశారని తెలిపారు. పొలాలు పూర్తిగా నీరు లేక పంట నాశనం అవుతున్నాయి అన్నారు. ఈనిక దశలో సాగునీరు లేకపోవడం వరి పొలం పొల్లు కాయలు గా మారిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరి దశలో ఉన్న పంట పొలాలకు వెంటనే పూర్తిస్థాయిలో సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు పంటచేలో నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.

రిలయన్స్, ఓ.ఎన్.జి.సి. ధవలేశ్వరం నుంచి పైపులైన్లు నిర్మించుకోవాలి : వళ్లు రాజబాబు

రిలయన్స్, ఓఎన్జిసి సంస్థలు తాళ్లరేవు డివైడింగ్ డాము వద్ద, మల్లం కోట లాకుల వద్ద నుంచి వేలాది క్యూసెక్కుల నీరు ప్రతినిత్యం తరలించకపోతున్నారని దీనివల్ల రైతాంగానికి నీటి ఎద్దడి తలెత్తుతుందని ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు తెలిపారు. అదనంగా ఎటువంటి సాగునీటి కేటాయింపులు లేకుండానే, రైతాంగానికి వచ్చిన సాగునీటినే ఈ సంస్థలు తరలించుకుపోతుంటే నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అందువల్ల సాగునీరు ఎద్దడి సమయంలో రిలయన్స్, ఓఎన్జిసి పైపులను నిలుపుదల చేసి రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రిలయన్స్, ఓఎన్జిసి సంస్థలు ధవలేశ్వరం నుంచి నేరుగా పైపులైను నిర్మించు కుంటే అసలు ఈ నీటి ఎద్దడి పరిస్థితి రాదని అన్నారు.

➡️